ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌: రెండో పెళ్లి కుదరదంతే! షరతులు వర్తిస్తాయి

27 Oct, 2023 16:58 IST|Sakshi

Assam అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ,  రాష్ట్ర ప్రభుత్వ అనుమతి  లేనిదే  రెండో పెళ్లి  చేసుకోవడం కుదరదని  తెగేసి చెప్పింది.   

అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని  అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత చట్టం ద్వారా  పలు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్‌లో పేర్కొంది, ఈ మేరకు అసోం సర్కార్‌ అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి  రావడం విశేషం.  (19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్‌ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్‌ పోల్‌ రంగంలోకి)

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు.  ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్‌ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలని గుర్తు చేశారు. ఈ  నేపథ్యంలోనే  నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. (2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు)

కాగా ఈ ఏడాది ప్రారంభంలో, అసోం బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్‌ చేస్తున్నామని, అనివార్య కారణాల  వల్ల అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్‌లో ప్రవేశపెడతామని  శర్మ  హింటిచ్చారు.  అలాగే  ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతోపాటు బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి  రాష్ట్ర శాసనసభకున్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, దీనికి కమిటీ  నివేదిక ఆమోదం  లభించినట్టు   ప్రభుత్వం తెలిపింది. 

ఇది ఇలా ఉంటే  ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముస్లిం మంత్రికి వ్యతిరేకంగా హిమాంత శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం  నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు