చరిత్ర సృష్టించిన రియాన్‌.. ఓవరాక్షన్‌ స్టార్‌ కాస్త సూపర్‌ స్టార్‌ అయ్యాడు..!

27 Oct, 2023 16:56 IST|Sakshi

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతూ, ఆటకంటే ఓవరాక్షన్‌ ద్వారా ఎక్కువ పాపులర్‌ అయిన రియాన్‌ పరాగ్‌ ఇటీవలికాలంలో అతిని పక్కకు పెట్టి ఆటపై మాత్రమే దృష్టి సారిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. వ్యక్తిగత ప్రవర్తనతో పాటు ఫామ్‌లేమి కారణంగా గత ఐపీఎల్‌లో సరైన అవకాశాలు రాని రియాన్‌.. ఆతర్వాత జరిగిన అన్ని దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో (సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ-2023) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్న రియాన్‌.. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తూ మ్యాచ్‌ విన్నర్‌గా మారాడు. ఈ టోర్నీలో అస్సాం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రియాన్‌.. వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు.

టీ20 క్రికెట్‌లో రియాన్‌కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు సాధించలేదు. ఈ టోర్నీలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతున్న రియాన్‌.. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు కూడా తీసి పర్ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రదర్శనలతో ఓవరాక్షన్‌ స్టార్‌ కాస్త సూపర్‌ స్టార్‌గా మారిపోయాడు. 

ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగంగా కేరళతో ఇవాళ (అక్టోబర్‌ 27) జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో ఫోర్‌, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసిన రియాన్‌.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా (17 పరుగులు) బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్‌ తీసుకుని తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

ఈ ప్రదర్శనకు ముందు రియాన్‌ వరసగా 102 నాటౌట్‌, 95 (దియోదర్‌ ట్రోఫీ), 45, 61, 76 నాటౌట్‌, 53 నాటౌట్‌, 76, 72 పరుగులు స్కోర్‌ చేశాడు. ఈ ప్రదర్శనలతో రియాన్‌ త్వరలో జరుగనున్న ఐపీఎల్‌ 2024 వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాన్‌ను రాయల్స్‌ టీమ్‌ రిలీజ్‌ చేయకపోతే.. ఆ జట్టులోనే మంచి అవకాశాలు దక్కే ఛాన్స్‌ ఉంటుంది. 

మరిన్ని వార్తలు