పొట్టి క్రికెట్‌లో కొనసాగుతున్న రియాన్‌ పరాగ్‌ విధ్వంసకాండ

1 Nov, 2023 08:31 IST|Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో అస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌) డ్రీమ్‌ రన్‌ కొనసాగుతుంది. ఈ టోర్నీలో అతను వరుసగా ఏడో హాఫ్‌ సెంచరీ బాదాడు. గత మ్యాచ్‌లో చేసిన హాఫ్‌ సెంచరీతో ప్రపంచ రికార్డు (టీ20ల్లో వరుసగా ఆరు హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా వార్నర్‌, సెహ్వాగ్‌, బట్లర్‌ల పేరిట ఉన్న రికార్డు బద్దలు) నెలకొల్పిన రియాన్‌.. తాజాగా హాఫ్‌ సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. 

బెంగాల్‌తో నిన్న (అక్టోబర్‌ 31) జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌-2లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన రియాన్‌.. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో అస్సాం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో రియాన్‌ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 50 పరుగులు చేశాడు.  

టీమిండియాలో చోటు దక్కేనా..?
ముస్తాక్‌ అలీ టోర్నీలో వరుసగా ఏడు హాఫ్‌ సెంచరీలు బాది జోరుమీదున్న రియాన్‌.. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటుపై కన్నేశాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ముందు నుంచే భీకరమైన ఫామ్‌లో ఉన్న రియాన్‌.. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తూ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే..
అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లు ఆకాశ్‌ సేన్‌గుప్తా 3, రియాన్‌ పరాగ్‌ 2, మ్రిన్మోయ్‌ దత్తా, శివ్‌శంకర్‌ రాయ్‌, సౌరవ్‌ డే తలో వికెట్‌ పడగొట్టారు. బెంగాల్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు కరణ్‌ లాల్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం.. రిశవ్‌ దాస్‌ (31), బిషల్‌ రాయ్‌ (45 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (50 నాటౌట్‌) రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్ననే జరిగిన మరో ప్రీక్వార్టర్‌ ఫైనల్లో గుజరాత్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. నవంబర్‌ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో రియాన్‌ పరాగ్‌ గణాంకాలు..

  1. 45(19) & 0/53(4)
  2. 61(34) & 2/25(4)
  3. 76(37) & 3/6(4)
  4. 53(29) & 1/17(4)
  5. 76(39) & 1/37(4)
  6. 72(37) & 1/35(3)
  7. 57(33) & 1/17(4)
  8. 50(31) & 2/23(4)
మరిన్ని వార్తలు