-

మారుమూల గ్రామాల్లో గ్యాస్‌ ఏజెన్సీలు

4 Nov, 2018 04:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్‌ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్‌సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలు సీఎస్‌సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్‌సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్‌ ఏజెన్సీలు.. కొత్తగా బుక్‌ చేసే ప్రతి గ్యాస్‌ కనెక్షన్‌పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్‌ సిలిండర్‌పై రూ.2, సీఎస్‌సీకి సిలిండర్‌ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి.

దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్‌ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్‌సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్‌సీ ఈ–గవర్నెన్స్‌ సీఈవో దినేశ్‌ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్‌సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు