శ్రీరామ నవమికి ముస్లింలు నీళ్లిచ్చారు

15 Apr, 2016 14:43 IST|Sakshi
శ్రీరామ నవమికి ముస్లింలు నీళ్లిచ్చారు

పాట్నా: దేశంలో అసహన పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ హిందువులు, ముస్లింలు పండగల సందర్భంగా పరస్పరం సహకరించుకోవడం, సమైక్యతను చాటుకోవడం  అప్పుడప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తుంది. శ్రీరామ నవమి సందర్భంగా గయాలో కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది.

గయాలో వైభవంగా జరిగే శ్రీరాముడి కళ్లాణాన్ని కళ్లారా చూద్దామని ఎండను లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హిందూ భక్తులకు ముస్లింలు నీళ్లిచ్చి ఆదుకున్నారు. మసీదుల వద్ద పెద్ద పెద్ద బానాలను ఏర్పాటు చేసి ప్రదర్శనగా వచ్చిన భక్తుల దాహార్తిని తీర్చారు. రామ నవమి ప్రత్యేక జెండాలను కూడా ఇక్కడి ముస్లిం దర్జీలే ఎప్పుడూ తయారు చేస్తారు. జెండాలను తయారు చేయంగలేనిది నీళ్లివ్వడం మంచిదేగదా అని నవ గఢీ ఖంకా ఇమామ్ అహ్మద్ సుజెయిల్ వ్యాఖ్యానించారు.
 

 జైనులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులకు గయా పవిత్ర క్షేత్రం. అప్పుడప్పుడు చెదురు మదురు సంఘటనలు మినహా ఇక్కడ అన్ని మతాల వారు సమైక్యంగానే జీవిస్తారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. జెడ్డాకు వెళ్లే హజ్ యాత్రికులకు వైష్ణవైట్ రామానుజాచార్య మఠంలో బసను ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన అన్న పానీయాలను మహంత్ దగ్గరుండి సరఫరా చేశారు. అలాగే పిత్రపక్ష మేళకు హాజరైన హిందువులకు ముస్లిం ఇమామ్‌లు భోజన, వసతులను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు