పుణేలో అంతుబట్టని బ్రెస్ట్ డిసీజ్

29 Mar, 2016 15:19 IST|Sakshi
పుణేలో అంతుబట్టని బ్రెస్ట్ డిసీజ్

ముంబై: మహారాష్ట్రలో అంతుబట్టని రొమ్ము వ్యాధి ప్రబలడం ఆందోళకు గురి చేస్తోంది. పుణె ప్రాంతంలో 20 -30 సంవత్సరాల మధ్య వయసున్న యువతుల్లో మిస్టరీ రొమ్ము వైరస్ విస్తరిస్తుండటం వైద్యవర్గాల్లో ఆలోచన పెంచుతోంది. అచ్చం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను పోలి వున్న ఈ వ్యాధి పుణె యువతుల్లో కనిపిస్తోంది. దీనిపై సీనియర్ డాక్టర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఇలాంటి కేసులు 50 శాతం పెరిగాయంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి లక్షణాలను పాలిచ్చే తల్లుల్లో, టీబీ రోగుల్లో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, అదీ 40-50 ఏళ్ల మహిళల్లో మాత్రమే చూసేవారమని,  ఇపుడు యువతుల్లో ఇలాంటి  కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, సరైన సమయంలో  గుర్తించి, దీర్ఘకాలం చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని సూచిస్తున్నారు.

భోసారికి చెందిన ప్రజక్త జాదవ్(28)  (పేరు మార్చాం) గత అక్టోబర్‌లో ఎడమ రొమ్ములో బాధాకరమైన గడ్డను గమనించారు. కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా గడ్డ  పెరగి,  రొమ్మునుంచి డిశ్చార్చ్ కూడా మొదలైంది. దీంతో ఆందోళన చెందిన ఆమె లేడీ డాక్టర్‌ను, తర్వాత ఆంకాలజిస్టును కలిశారు.  తీవ్రమైన అంటువ్యాధి అని  తేల్చిన డాక్టర్లు ఆపరేషన్ చేసి చీమును తొలగించారు. తాను చాలా శుభ్రంగా ఉంటాననీ, తనకు ఎందుకు ఈ వ్యాధి సోకిందో అర్థం  కావడం లేదని ఆమె వాపోయారు.

పింప్రి కి చెందిన  ఆశా శామ్యూల్ (25)ది (పేరు మార్పు) కూడా దాదాపు ఇలాంటి కేసే. ఆమె ఎడమ నిపుల్ బుడగ రూపంలోకి మారి  గట్టిపడి గడ్డలాగా  ఏర్పడింది. దీంతో  ఆమె కేన్సర్ అని భయపడి డాక్టర్లను సంప్రదించారు. గత నాలుగు నెలలుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. 

ఇలాంటి కేసులు గతంలో నమోదయ్యాయి గానీ ఇంత పెద్దసంఖ్యలో  లేవని బ్రెస్ట్ క్యాన్సర్ సీనియర్  వైద్యులు డా. సీబీ కోపికర్ అన్నారు.  ప్రతి నెల ఆరు కొత్త కేసులు వస్తుండగా.. 15 - 30 మంది  తిరిగి ఈ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారని తెలిపారు. చూడ్డానికి  రొమ్ము టీబీని పోలి ఉన్నా.. కచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదన్నారు. అయితే ఏడెనిమిది నెలలపాటు మందులు వాడాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు  వీటిని గుర్తించకుండా, తప్పుడు వ్యాధినిర్ధారణతో, రొమ్ము శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారని కోపికర్  పేర్కొన్నారు.
   
పెరుగుతున్న కేసులుసంఖ్య  ఆందోళన కలిగిస్తోందని జహంగీర్ ఆసుపత్రి కి చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్, మహారాష్ట్ర ఆంకాలజీ సొసైటీ వ్యవస్థాపకుడు డా. షోనా నాగ్ చెప్పారు. కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు బలమైన పరిశోధన జరుగుతోందన్నారు.  వ్యాధి కారణాలను నిర్ధారిస్తే చికిత్స సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే వ్యాధి లక్షణాలను బట్టి  క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


టాటా మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు కూడా ఈ ఇన్ఫక్షన్ పై ఆశ్యర్యం వ్యక్తంచేశారు. దీనిపై  రాష్ట్రంలోని  ఇతర వైద్యనిపుణులు, ఆంకాలజిస్టులతో చర్చిస్తున్నామని జన్యుశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ రాజీవ్ సారిన్  తెలిపారు.  హార్మోన్ పెరుగుదలలో అసమతుల్యత,  రోగనిరోధక శక్తి  తగ్గిపోవడం వల్ల రొమ్ములో గడ్డలు ఏర్పడి ఇన్ఫెక్షన్  కి దారితీస్తుందన్నారు.  అయితే  ఈ వ్యాధి నిర్ధారణకు  విస్తృతమైన అధ్యయనం చేయాల్సి ఉందని  తెలిపారు.

మరిన్ని వార్తలు