నారద సీఈవో సంచలన ఆరోపణలు

22 Mar, 2017 17:43 IST|Sakshi
నారద సీఈవో సంచలన ఆరోపణలు

కోల్ కతా: నారద స్టింగ్‌ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఆ సంస్థ న్యూస్ సీఈవో మాథ్యూ శామ్యూల్ పోలీసులను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా ఆమెకు చుక్కెదురైన విషయం తెలసిందే. మార్చి 17న కోల్ కతా హైకోర్టు స్టింగ్ ఆపరేషన్‌పై ప్రాథమికంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటి నుంచీ తృణముల్ కాంగ్రెస్ నేతల నుంచి తనకు, తన కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయని.. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో శామ్యూల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఫ్యామిలీ కూడా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

తనతో పాటుగా ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు అధికమయ్యాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. నారదా స్టింగ్ ఆపరేషన్‌లో మొదటి వ్యక్తిని తానేనని, తనపై అనవసరంగా కేసులు నమోదుచేసే యత్నం జరుగుతోందని ఆరోపించారు. తద్వారా తనను ఉద్యోగం నుంచి తప్పించాలన్నది ప్రభుత్వం చర్యేనని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఎవరిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందో.. కేవలం వారి నుంచి తనకు, తన ఉద్యోగులకు ప్రాణహాని ఉందన్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వారిలో అప్పటి, ప్రస్తుత మంత్రులు, సీనియర్‌ నేతలు ఉండటంతో ప్రభుత్వం ఆ న్యూస్ మీడియా జర్నలిస్టులపై వేధింపు చర్యలు చేపట్టిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొందరు తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. గతేడాది పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను ‘నారదన్యూస్‌.కామ్‌’లో ప్రసారమయ్యాయి. అయినా ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోల్ కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా మమతకు చుక్కెదురైంది. 

మరిన్ని వార్తలు