సోషల్‌ మీడియాలో ‘చెత్త’ వద్దు

30 Aug, 2018 02:46 IST|Sakshi

వారణాసి బీజేపీ కార్యకర్తలతో మోదీ

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా అనవసర విషయాలను ప్రచారం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. దేశం గురించి గొప్పగా చెప్పే, సమాజ బలోపేతానికి దోహదపడే సానుకూల వార్తలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం వారణాసికి చెందిన బీజేపీ కార్యకర్తలు, వలంటీర్లతో మోదీ బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. గల్లీలో రెండు కుటుంబాల మధ్య జరిగే చిన్నాచితకా గొడవలను సోషల్‌ మీడియాలో జాతీయస్థాయి వార్తగా చిత్రిస్తుండటంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు.

మానసిక పవిత్రతకూ ‘స్వచ్ఛ్‌ భారత్‌’..
‘ప్రజలు కొన్నిసార్లు మర్యాద హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాము విన్న తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంపిస్తున్నారు. దీని వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతోందో వారు గ్రహించడం లేదు. సమాజ ఔన్నత్యానికి తగని పదాలను వాడుతున్నారు. మహిళల గురించి ఏది తోచితే అది రాస్తున్నారు. నేను మాట్లాడుతోంది ఏదో ఒక రాజకీయ పార్టీకో, సిద్ధాంతానికో సంబంధించింది కాదు. మొత్తం 125 కోట్ల మంది భారతీయులతో ముడిపడి ఉంది’ అని మోదీ అన్నారు.

నేడు నేపాల్‌కు మోదీ
కఠ్మాండులో జరిగే నాలుగో బిమ్స్‌టెక్‌ (బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక సహకార సంస్థ) సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ గురువారం నేపాల్‌ బయల్దేరనున్నారు. రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు.

>
మరిన్ని వార్తలు