Archaeological Survey of India: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక

19 Dec, 2023 05:01 IST|Sakshi

సీల్డుకవర్‌లో అందజేసిన ఏఎస్‌ఐ అధికారులు

ఈ నెల 21న విచారణ చేపడతామన్న వారణాసి జిల్లా కోర్టు

వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్‌ఐ(ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) అధికారులు సీల్డు కవర్‌లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే.

సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్‌ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్‌ను తాము సవాల్‌ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్‌ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్‌ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది.

కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా
ప్రయాగ్‌రాజ్‌: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్‌ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్‌ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది.

>
మరిన్ని వార్తలు