‘రిజర్వేషన్లు’ రాజకీయ సంకల్పం

17 Jan, 2019 21:01 IST|Sakshi
కొత్తగా ప్రారంభించిన ఆస్పత్రిలో వసతుల్ని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేపట్టిన రాజ్యాంగ సవరణ తమ ప్రభుత్వ రాజకీయ సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని అన్నారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆయన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..‘కొత్త రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న 40వేల కాలేజీలు, 900 వర్సిటీల్లో అమలు చేస్తాం. ఆయా సంస్థల్లో అందుబాటులో ఉండే సీట్లను మరో 10% పెంచుతాం. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’అని తెలిపారు. దేశవ్యాప్తంగా 100 రోజుల్లో 7 లక్షల మంది పేదలు ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద వైద్య సేవలు పొందారని ఆయన తెలిపారు. హెలిప్యాడ్, ఎయిర్‌ అంబులెన్స్‌ ఉన్న ఏకైక ఈ 1500 పడకల ఆస్పత్రి పనులు 2012లో మొదలయ్యాయి. అధునాతన సదుపాయాలున్న ఈ సూపర్‌ స్పెషాలిటీ ప్రజా వైద్య శాలను అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిం చింది. ఆయుష్మాన్‌ భారత్‌ కోసమే నిర్మించిన ఈ ఆస్పత్రి పేపర్‌ వినియోగం లేకుండా సేవలందించనుంది.

కోట్లాది ఉద్యోగావకాశాల సృష్టి
తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో వివిధ రంగాల్లో కోట్లాది ఉద్యోగావకాశాలను సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ ప్రేరణతో నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌– 2019ను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘పర్యాటకం కావొచ్చు, తయారీ లేక సేవల రంగం కావొచ్చు.. కోట్లాది ఉద్యోగావకాశాలను గత నాలుగున్నరేళ్లలో సృష్టించాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనను సాధ్యమైనంత మేర ప్రోత్సహించాం. చిన్న పరిశ్రమల కోసం రూపకల్పన చేసిన జెమ్‌ (గవర్నమెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌) వేదికగా రూ.16,500 కోట్ల వ్యాపారం జరిగింది’అని తెలిపారు. ఇకపై జీఎస్టీ రిటర్నుల ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇచ్చే విధానం రాబోతోందన్నారు. పరోక్ష పన్నుల విధానాన్ని కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణరంగం దెబ్బతిన్న కారణంగా 2018లో దాదాపు కోటికిపైగా ఉద్యోగావకాశాలు తగ్గిపోయినట్లు ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా’అనే స్వతంత్ర సంస్థ తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగావకాశాలను సృష్టించిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

వైబ్రెంట్‌ గుజరాత్‌ ట్రేడ్‌ షో ప్రారంభం
ప్రధాని మోదీ గాంధీనగర్‌లో వైబ్రెంట్‌ గుజరాత్‌లో భాగంగా మహాత్మా మందిర్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ట్రేడ్‌ షోను ప్రారంభించారు. అనంతరం ఆయన కొన్ని స్టాళ్లను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 25 పారిశ్రామిక, వాణిజ్య రంగాల వారు పాల్గొంటున్నారు. గుజరాత్‌లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 2003లో సీఎంగా ఉన్న సమయంలో మోదీ వైబ్రెంట్‌ గుజరాత్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఆయన తొమ్మిదో ఎడిషన్‌ వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. శనివారం సూరత్‌లో హజీరా గన్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్‌ హవేలీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదే రోజు ముంబై చేరుకుని నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఇండియన్‌ సినిమా కొత్త భవనాన్ని మోదీ ప్రారంభిస్తారు. 

మరిన్ని వార్తలు