నాసాకు లభించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ

3 Dec, 2019 10:15 IST|Sakshi

శిథిలాల వ‌ల్ల దెబ్బ‌తిన్న చంద్రుడి ఉప‌రిత‌లం

సాక్షి, హైద‌రాబాద్‌: విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ లభించింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న విక్ర‌మ్ శిథిలాల‌ను నాసా గుర్తించింది. ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. చందమామపై చీకటి వల్ల ఇన్నాళ్లూ ఆ ల్యాండర్ ఎక్కడ కూలిపోయిందో కనిపెట్టలేకపోయాం. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను త‌న ట్విట్ట‌ర్‌లో  షేర్ చేసింది. ఇస్రో ఎంతో ‍ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్ర‌యాన్‌2 ద్వారా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. అయితే సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ స‌మ‌యంలో విక్ర‌మ్ అదుపు త‌ప్పింది.  ల్యాండ‌ర్ కోసం శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభించలేదు.


చివరికి అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ మంగళవారం విక్ర‌మ్‌కు సంబంధించిన చిత్రాల‌ను రిలీజ్ చేసింది. లూనార్ రిక‌యిన‌సెన్స్ ఆర్బిటార్‌ (ఎల్ఆర్‌వో) తీసిన ఫోటోల్లో విక్ర‌మ్ క‌నిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీక‌రించింది. విక్ర‌మ్ శిథిలాలూ అక్క‌డే ఉన్నాయి.విక్ర‌మ్ శిథిలాల‌ను భార‌తీయ ఇంజినీర్‌ ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ గుర్తించిన‌ట్లు నాసా చెప్పింది. విక్ర‌మ్ గ‌తిత‌ప్పిన వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో విక్ర‌మ్ శిథిలాలు క‌నిపించాయి. తాజాగా న‌వంబ‌ర్‌లో తీసిన ఫోటోల‌ను నాసా ఇంకా ప‌రిశీలిస్తున్న‌ది. అయితే విక్ర‌మ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాల‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

వాస్త‌వానికి చంద్రుడి ద‌క్షిణ ద్రువానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ల్యాండ‌ర్‌తో ఇస్రో సంకేతాల‌ను కోల్పోయింది. లూనార్ ఆర్బిటార్ సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఫ‌స్ట్ మొజాయిక్ ఫోటోను రిలీజ్ చేసింది. కానీ ఆ ఫోటోలో విక్ర‌మ్ ఆచూకీ చిక్క‌లేదు. అయితే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న శాస్త్ర‌వేత్త ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు విక్ర‌మ్ కూలిన ప్రాంతం క‌నిపించింది. ఆ త‌ర్వాత ఎల్ఆర్‌వో టీమ్‌తో ష‌ణ్ముగ త‌న డేటాను షేర్ చేశాడు. దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్‌వో విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించింది.

మరిన్ని వార్తలు