ఎల్జీ పాలిమర్స్‌ ఘటన: ఎన్‌జీటీ తీర్పు

3 Jun, 2020 18:47 IST|Sakshi

న్యూఢిల్లీ: విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు, బాధితులకు పంచాలని ఆదేశించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు రెండు నెలల్లో ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీని రెండు  వారాల్లో ఏర్పాటు చేయాలన్న ఎన్‌జీటీ.. రెండు నెలల్లో నివేదిక అందజేయాల్సిందిగా కమిటీని ఆదేశించింది. అదే విధంగా తుది నష్టపరిహారాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ.. కాలుష్య నియంత్రణ మండలి కలిసి అధ్యయనం చేయాలని సూచించింది. (‘మేఘాద్రి’లో స్టైరిన్‌ లేదు)

ఇక కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారంగా నడుచుకోని అధికారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ కంపెనీకి అనుమతులు ఇస్తే వాటి వివరాలు ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ పర్యవేక్షణ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని.. అదే విధంగా రసాయన పరిశ్రమల పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది.(నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం‌ జగన్‌)

కాగా గ్యాస్‌ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ. కోటి రూపాయిల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు. అదే విధంగా విషాదానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను ప్రభుత్వం నియమించింది. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు