ఒడిశాలో నవీన్ మేజిక్

17 May, 2014 04:00 IST|Sakshi
ఒడిశాలో నవీన్ మేజిక్

 అసెంబ్లీ ఎన్నికల్లో 115 సీట్లలో బీజేడీ విజయ దుందుభి
 
 భువనేశ్వర్:
దేశమంతా ఓవైపు నరేంద్ర మోడీ హవా కొనసాగుతున్నా ఒడిశాలో మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మ్యాజిక్ పనిచేసింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లకుగానూ మూడింట రెండొంతుల మెజారిటీతో 115 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11, సమతా క్రాంతి దళ్ 1 సీటు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు.
 
 అరుణాచల్ మళ్లీ కాంగ్రెస్‌దే

 ఇటానగర్: దేశవ్యాప్తంగా పేలవ ఫలితాలు కనబరిచినప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంది. 60 సీట్లున్న అరుణాచల్ అసెంబ్లీలో 11 సీట్లు ఏకగ్రీవంకాగా మిగిలిన 49 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ 42 సీట్లతో (ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచిన 11 సీట్లతో కలుపుకొని) విజయఢంకా మోగించింది.

 సిక్కింలో ఎస్‌డీఎఫ్‌కే: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్)కే ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 32 సీట్లుగల సిక్కిం అసెంబ్లీలో ఎస్‌డీఎఫ్ 23 సీట్లలో గెలుపొందగా సిక్కిం క్రాంతికారీ మోర్చా 9 సీట్లు గెలుచుకుంది

మరిన్ని వార్తలు