మహాత్మా గాంధీ భార్యను కొట్టారా?

19 Mar, 2016 16:55 IST|Sakshi
మహాత్మా గాంధీ భార్యను కొట్టారా?

న్యూఢిల్లీ: అహింసావాది, జాతిపిత మహాత్మా గాంధీ తన భార్య కస్తూర్బా గాంధీని ఎప్పుడైనా కోపాన్ని తట్టుకోలేక చెంప మీద కొట్టారా ? కొట్టారని చెబుతున్నారు రచయిత ప్రమోద్ కపూర్ తాను రాసిన తాజా పుస్తకం ‘గాంధీ ఎన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ’లో. అంతేకాకుండా గాంధీ తన కుటుంబ సభ్యుల పట్ల ఓ ‘సర్కస్ రింగ్ మాస్టర్’లా వ్యవహరించారని, ఇదే విషయాన్ని ఆయన కుమారుడు హరిలాల్ గాంధీ తన తండ్రికి రాసిన 14 పేజీల లేఖలో తెలిపారని ప్రమోద్ కపూర్ పేర్కొన్నారు. తన సన్నిహితులు, దగ్గరి శిష్యులతో డిక్టేటర్‌గా వ్యవహరించేవారని కూడా తెలిపారు.

దేశంలో ఖాదీ ఉద్యమం ఊపందుకున్న రోజుల్లో విదేశీ వస్త్రాలను విసర్జించి ఖాదీ చీరలనే కట్టుకోవాలని దేశ ప్రజలతోపాటు కస్తూర్భా గాంధీని కూడా మహాత్మా గాంధీ ఆదేశించారట. బరువైన ఖాదీ చీరను కట్టుకొని తాను ఇంట్లో పనులు చేసుకోనని, ముఖ్యంగా వంట చేయలేనని కస్తూర్భా మొరపెట్టుకున్నారట. ఆ మాటలకు కోపం వచ్చిన గాంధీ భార్యపై చేయి చేసుకున్నారట. అయితే వంట చేయకని, విదేశీ వస్త్రం ధరించి వంట చేస్తే తాను తినని కూడా గాంధీ భీష్మించుకు కూర్చున్నారట. అప్పుడు భార్య కళ్ల నుంచి మౌనంగా కారిన కన్నీళ్లను చూసిన గాంధీకి అహింస గొప్పదనం గురించి తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసిందట.

ఖాదీ ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకోని వారిపట్ల మహాత్మాగాంధీ కోపంగా ప్రవర్తించే వారట. తనకు చరఖాపై నూలు నేయడం రాదన్న కారణంగా గాంధీజీ ఆయన ఫొటోను తీయడానికి ఒప్పుకోలేదని లైఫ్ మేగజైన్ ఫొటోగ్రాఫర్ మార్గరెట్ బౌర్కే వైట్ ఓ సందర్భంలో వెల్లడించారు. మహాత్మా గాంధీ జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ఎన్నో అంశాలు ఉంటాయి. అందుకనే ఆయన జీవిత చరిత్రపై ఇప్పటికే వందలాది పుస్తకాలు వెలువడ్డాయి. గాంధీ మాత్రం 98 సంకలనాల్లోగానీ, ‘మై ఎక్స్‌పరమెంట్స్ విత్ ట్రుత్’ పుస్తకంలోగానీ భార్యను చెంపదెబ్బ కొట్టిన అంశం లేదు.

మరిన్ని వార్తలు