అరటికి చేటొచ్చింది!

10 Jun, 2018 02:01 IST|Sakshi

మన దగ్గరి ఎర్రటి చక్కరకేళీ అరటి పండు పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. ఇక సన్నగా, పొట్టిగా ఉండే ఏలక్కి రకం అరటి కర్ణాటకలో ప్రసిద్ధి. మైసూరు అరటిపళ్లది మరో రుచి, కేరళ అరటిపళ్ల రంగు వేరుగానీ ఒకసారి తింటే ఆ రుచిని మరచిపోవడం కష్టమే. ఇప్పుడిలా కొన్ని రకాలే అందుబాటులో ఉన్నాయిగానీ..  ఒకప్పుడు వందల రకాల అరటిపళ్లు ఉండేవట. అంతేకాదు ఇంకొన్నేళ్లయితే భూమ్మీద ఏ మూలనైనా అరటిపండు ఒకేలా ఉంటుందని.. తరువాత అది కూడా కనిపించకుండా పోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మోనో కల్చర్‌ (ఒకే జాతి పంటను ఎక్కువగా పండించడం) కారణంగా అరటి పంట నశించిపోయే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు మనం వినియోగిస్తున్న అరటి పండు.. అసలు సిసలు అరటి పండు కాదు. వేర్వేరు రంగుల్లో, రుచుల్లో ఉండేది. వాటిల్లో గింజలూ ఉండేవి. ఇప్పుడు రంగునీ, రుచినీ, రూపాన్నీ కోల్పోయి.. వ్యాపారానికి అనుగుణమైన లక్షణాలతో ఒకే రకంగా మారిపోయింది.

కాలక్రమేణా అరటి పండు అంటే ఇలాగే ఉంటుందనే పరిస్థితి వచ్చింది. 1880 సంవత్సరం సమయంలో అమెరికా, జమైకాలలో తొలుత అరటి పంటను పండించారట. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి, వాణిజ్యానికి అనుగుణంగా పాడవకుండా నిల్వ ఉండేందుకు అరటిలో మార్పులు చేస్తూ చివరికి ఈ రూపానికి తీసుకువచ్చారు.

ఇప్పుడొచ్చిన సమస్యేంటి?
అరటిపళ్లలో ఉండే పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అలాంటి అరటి అంతర్థానమయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1950 ప్రాంతంలో ఫుసారియం విల్ట్‌ అనే ఫంగస్‌ సోకడం వల్ల కొన్ని వందల రకాల అరటి నాశనమైపోయిందని.. ఇప్పుడూ అలాంటి పరిస్థితే వస్తోందని అంటున్నారు. అప్పట్లో అరటి బాగా దెబ్బతినడంతో.. ఆ వ్యాధి సోకని జాతిని ఒకదాన్ని ఎంచుకుని సాగును విస్తృతం చేశారు.

కానీ పుసారియం విల్ట్‌ ఫంగస్‌ ఇప్పుడు కొత్త అవతారమెత్తి.. ఈ అరటినీ కబళిస్తోంది. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ ఫంగస్‌ కారణంగా పెద్ద ఎత్తున అరటి పంట నాశనమవుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఫంగస్‌కు వేగంగా విస్తరించే లక్షణముంది. ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండించే ఆస్ట్రేలియాకు ఇది పాకేసింది. సాగులో తరువాతి స్థానాల్లో ఉన్న ఈక్వెడార్, కోస్టారికాలకు సమీపిస్తోంది. ఇదే జరిగితే అరటికి కాలం చెల్లినట్లే! ఆందోళనకర విషయం ఏమిటంటే.. అప్పట్లో ఉన్నట్టుగా ఇప్పుడు ప్రత్యామ్నాయ అరటి రకం ఏదీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు