ధన్యవాదాలు;మరిన్ని సూచనలు ఇవ్వండి!!

6 Jun, 2019 14:52 IST|Sakshi

న్యూఢిల్లీ : బడ్జెట్‌ విషయంలో అన్ని వర్గాల నుంచి వస్తున్న సూచనలు తప్పక పరిగణనలోకి తీసుకుంటానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మేధావులు, ఆర్థికవేత్తలు, సామాన్యులు మీడియాలో పంచుకుంటున్న అభిప్రాయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు..‘  ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా ద్వారా విలువైన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, ఔత్సాహికులకు రుణపడి ఉంటాను. వాటిన్నంటినీ నేను చదువుతున్నాను. మీ సూచనలను నా టీమ్‌తో సమన్వయం చేసుకుంటున్నాను. ప్రతీ ఒక్కరి అభిప్రాయం విలువైందే. ధన్యవాదాలు. మరిన్ని సలహాలు, సూచనలు చేయండి’ అని ఆమె ట్వీట్‌ చేశారు. దేశ తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ జూలై 5న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ట్వీట్‌ ప్రాధాన్యం సంతరిచుకుంది.

కాగా రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన నిర్మలా సీతారామన్‌కు.. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పట్ల అనుసరిస్తున్న వైఖరి, వాణిజ్య ప్రాధాన్య హోదా రద్దు చేయడం ఆర్థికవేత్తలను కలవరపెడుతున్నాయి. అంతేకాకుండా ట్రంప్‌ ఆంక్షల కారణంగా అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంలో మొదటిసారిగా ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తోన్న నిర్మలా సీతారామన్‌కు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ విలువైన అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు