వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్‌పై సబ్సిడీ కట్

29 Dec, 2015 03:02 IST|Sakshi
వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్‌పై సబ్సిడీ కట్

కేంద్రం నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి..
 
 న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఎల్పీజీ వినియోగదారులపై కేంద్రం  మరో బాంబు పేల్చనుంది. ఈ సారి వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని సబ్సిడీ ఎత్తివేసేందుకు ప్రణాళిలు సిద్ధం చేసింది. వార్షికాదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు వంట గ్యాస్ సబ్సిడీపై కోత పెట్టనుంది.  రాయితీ భారాన్ని మరింత తగ్గించుకునేందుకుకేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.   2016 జనవరి నుంచే అమల్లోకి వచ్చే ఈ నిబంధన ప్రకారం.... వినియోగదారులైన భార్యా, భర్తల్లో ఎవరో ఒకరు పదిలక్షల కంటే  ఆదాయం ఉండి పన్ను చెల్లిస్తుంటే  వంట గ్యాస్ రాయితీని  కోల్పోతారు. ప్రారంభంలో వినియోగదారుడి ప్రమాణ పత్రం ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు.

2014-15లో కేంద్రం ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.40,551 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ ఏడాది ఆయిల్ ధరలు తగ్గడంతో ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో రూ.8,814 కోట్లు మాత్రమే కేంద్రం భరించింది. ఈ భారాన్ని  తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా సబ్సిడీలకు కోతపెడుతోంది. ప్రస్తుతం వినియోగదారులందరికీ  ఏడాదికి 12 సిలిండర్లను అందిస్తున్నారు.  మార్కెట్ ధర  ప్రకారం సిలిండర్ రూ.608 ఉండగా సబ్సిడీపై రూ.419.26కు అందిస్తున్నారు.   ధనవంతులు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు రాయితీని  వదులుకోవాలంటూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు  మంచి స్పందనే వచ్చింది. 

దేశంలోని 15 కోట్ల మంది వినియోగదారుల్లో 57.5 లక్షల మంది  రాయితీని రద్దు చేసుకున్నారని పెట్రోలియం శాఖ తెలిపింది. గత యూపీఏ హయాం నుంచి ఎల్పీజీ మంటలు కొనసాగుతున్నాయి. సంవత్సరానికి ఆరు సిలెండర్లే అంటూ 2012లో యూపీఏ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దానిపై వ్యతిరేకత రావడంతో 2013 జనవరిలో తొమ్మిదికి పెంచింది. జనవరి 2014న  మళ్లీ సమీక్షించి ఏప్రిల్ నుంచి 12 సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు