27 ఏళ్ల శ్రమదానం.. శ్రీమంతుడు..

28 Aug, 2017 10:50 IST|Sakshi



సాక్షి, కోరియా:
27 ఏళ్ల కష్టం అతన్ని హీరో చేసింది. సొంత ఊరి కోసం ఒక్కడే కష్టించిన శ్రీమంతుడు శ్యామ్‌ లాల్‌(42). శ్యామ్‌ సొంత ఊరు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కోరియా జిల్లాలోని సాజా పహద్‌ గ్రామం. కోరియా జిల్లా చత్తీస్‌ఘడ్‌లో అత్యధికంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రాంతం. దీంతో సాజా పహద్‌కు చెందిన ప్రజలు తాగునీటికి, మూగ జీవాలకు నీటిని అందించలేదని పరిస్థితి ఉండేది.

ప్రభుత్వం తరఫు నుంచి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామ ప్రజల దుస్థితి శ్యామ్‌ను కదిల్చింది. దీంతో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి గ్రామం కోసం ఊరి చివర్లో చెరువు తవ్వాలనే ఆలోచన వచ్చిందాయనకు. అయితే, శ్యామ్‌కు అప్పుడు 15 ఏళ్లు. దీంతో శ్యామ్‌ ఆలోచనకు గ్రామంలో ఎవరూ మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ ఆలోచనను విరమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.



అయినా, తన ఆలోచనను విరమించుకోని శ్యామ్‌.. తనొక్కడే రోజుకు కొంతభాగం చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామ పొలిమేర్లలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకుని తవ్వకాన్ని ప్రారంభించాడు. రోజూ తన జీవనం కోసం పనికి వెళ్లొచ్చిన అనంతరం చెరువు కోసం 27 ఏళ్లుగా శ్రమదానం చేస్తూ వచ్చాడు శ్యామ్‌.

అతని కష్టానికి ఫలితం నేడు దక్కింది. వర్షాలు కురిసిన సమయంలో చెరువులోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఊరిలో అందరూ చెరువు నీటిని అవసరాలకు వినియోగించుకుంటున్నారని సాజా పహద్‌ నివాసి ఒకరు తెలిపారు. శ్యామ్‌ తమ ఊరి 'శ్రీమంతుడు' అని అన్నారు.

మరిన్ని వార్తలు