‘పద్మావతి’ని ఆడనివ్వం

21 Nov, 2017 01:43 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ సీఎం వెల్లడి

భోపాల్‌: పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారని వార్తలు వస్తున్నాయనీ, ఒకవేళ అదే నిజమైతే మధ్యప్రదేశ్‌లో ఆ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా రాజ్‌పూత్‌ వర్గానికి చెందిన కొందరు సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ ‘చరిత్ర వక్రీకరణను మేం సహించం. రాణీ పద్మావతి గొప్పతనం గురించి మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే సన్నివేశాలు సినిమాలో ఉంటే ఇక్కడ ఆడనివ్వం’ అని చౌహాన్‌ అన్నారు.

మహిళల రక్షణకు విశిష్ట సేవలందించే వ్యక్తులకు ‘రాష్ట్రమాత పద్మావతి అవార్డుల్ని’ అందజేస్తామని ప్రకటించారు. శౌర్యపరాక్రమాలు చూపినవారికి ‘మహారాణా ప్రతాప్‌ అవార్డు’ ఇస్తామన్నారు. మరోవైపు కేంద్రానికి తామిచ్చిన సూచనల్ని అంగీకరిస్తేనే రాష్ట్రంలో పద్మావతి చిత్రం విడుదల అవుతుందని రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజే స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, పద్మావతి చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ వచ్చిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. సినిమాకు ఇంకా సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ ఇవ్వనందున, ఇప్పుడే ఈ అంశాన్ని తాము చేపట్టడం తొందరపాటవుతుందని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు