పెళ్లికి వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు!

15 Nov, 2016 19:12 IST|Sakshi
పెళ్లికి వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు!
అంగరంగ వైభవంగా జరగనున్న గాలి జనార్దనరెడ్డి కుమార్తె పెళ్లికి వెళ్లొద్దని తనకు ఎవరూ చెప్పలేదని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఈ పెళ్లికి వెళ్లాలా.. వద్దా అనే విషయంలో చాలామంది నాయకులకు శషభిషలున్నాయి. గాలి జనార్దనరెడ్డితో సత్సంబంధాలున్న బీజేపీ అగ్రనాయకత్వం కూడా దీనిపై ఏమీ చెప్పలేదు. వెడ్డింగ్ కార్డుతోనే అదరగొట్టిన జనార్దనరెడ్డి సోదరులు.. ఇక పెళ్లిని ఇంకెంత వైభవంగా చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీ నాయకులు ఎవరూ ఈ పెళ్లికి హాజరు కావొద్దని బీజేపీ అగ్రనాయకత్వం చెప్పిందంటూ వచ్చిన కథనాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన యడ్యూరప్ప తోసిపారేశారు. 
 
జనార్దనరెడ్డి ఇప్పుడు, ఎప్పుడూ కూడా బీజేపీ నాయకుడేనని.. అందువల్ల ఆయన కూతురి పెళ్లికి పార్టీ నాయకులు వెళ్లడంలో తప్పేమీ లేదని బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగన గౌడ అన్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులతో సహా పలువురు అగ్రనేతలకు ఒక్కోటి రూ. 10వేల విలువైన పెళ్లి శుభలేఖలు వెళ్లాయని తెలుస్తోంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడలను కూడా పెళ్లిక ఆహ్వానించారు గానీ.. వాళ్లు హాజరు అవుతారో లేదో అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. 
 
660 ఎకరాల విస్తీర్ణం ఉన్న బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో బుధవారం ఈ పెళ్లి జరగనుంది. పెళ్లి వేదికను ముందుగానే మీడియా ఫొటోగ్రాఫర్లు ఎక్కడ అత్యుత్సాహంతో ఫొటోలు తీసి బయటపెడతారోనని ముందు జాగ్రత్తగా దాదాపు 3వేల మంది సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్లను వివాహ వేదిక వద్ద నియమించారని తెలుస్తోంది. పెళ్లికి దాదాపు 50 వేల మంది అతిథులు వస్తారని అంచనా. ఒక జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ తన సెల్‌ఫోన్‌తో వివాహ వేదిక ఫొటో తీసేందుకు ప్రయత్నించగా, బౌన్సర్లు అతడి ఫోన్ లాగేసుకున్నారు.
>
మరిన్ని వార్తలు