పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్

15 Dec, 2023 08:39 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రతిపక్షాల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితువు పలికారు. 

'ఇది తీవ్రమైన సంఘటన. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. సహజంగానే లోపం జరిగింది. పార్లమెంట్ భద్రత స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉంటుందని అందరికీ తెలుసు. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖకు స్పీకర్ లేఖ కూడా రాశారు. మేము విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదికను త్వరలో స్పీకర్‌కు పంపుతాం.' అని అమిత్ షా చెప్పారు.

భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు పార్లమెంట్ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ భద్రతలో లోపాలు ఉండకూడదని పేర్కొన్న అమిత్ షా.. ఆ ఖాళీలను పూడ్చడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దీన్ని రాజకీయ అంశంగా మార్చవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.  మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ


 

>
మరిన్ని వార్తలు