గ్యాస్ ధర పెరిగింది.. విమాన ఇంధనం తగ్గింది

1 Jan, 2016 15:54 IST|Sakshi
గ్యాస్ ధర పెరిగింది.. విమాన ఇంధనం తగ్గింది

సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ల ధరను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెంచింది. ఒక్కో సిలిండర్ ధర దాదాపు రూ. 50 వరకు పెరిగింది. ఈ పెరుగుదల శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. స్థానిక పన్నులతో కలుపుకొని 14.4 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 657.50, కోల్‌కతాలో రూ. 686.50, ముంబైలో రూ. 671, చెన్నైలో రూ. 671.50 చొప్పున ఉండనున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు సిలిండర్ ధరను దాదాపు రూ. 60 చొప్పున పెంచారు. అలాగే, పన్ను విధించదగ్గ వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వబోమని కేంద్రం చేసిన ప్రకటన కూడా శుక్రవారం నుంచే అమలులోకి రానుంది.

అయితే.. క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు దాదాపు 30 డాలర్ల మేర తగ్గడంతో ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ధరను ఒకేసారి 10 శాతం తగ్గించారు. దాంతో ఢిల్లీలో ఇంతకుముందు కిలోలీటర్ ఏటీఎఫ్ దర రూ. 44,320 ఉండగా, అదిప్పుడు రూ. 39,892 అయ్యింది. ఈ తగ్గింపుతో ఎయిర్‌లైన్స్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

మరిన్ని వార్తలు