ఉగ్రదాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురి మృతి

21 May, 2019 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తిరప్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన ఎమ్మెల్యే తిరంగ్‌ అబో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. కాగా ఈ దాడి ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు.

తిరంగ్‌ అబో అసోం నుంచి ఖోన్సా వెస్ట్‌ నియోజకవర్గానికి వెళుతున్న క్రమంలో తిరప్‌ జిల్లాలోని బోగపని గ్రామం వద్ద ఉగ్రవాదులు ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర దాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురు వ్యక్తులు ఘటనాస్ధలంలోనే మరణించారని తిరప్‌ డీసీపీ తుంగన్‌ తెలిపారు. కాగా దాడిని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా తీవ్రంగా ఖండించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లను ఆయన కోరారు.

మరిన్ని వార్తలు