రచయిత్రి ఓల్గాకు సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం

17 Feb, 2016 04:15 IST|Sakshi
రచయిత్రి ఓల్గాకు సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆమె రచించిన కథల సంపుటి ‘విముక్త’కు గాను గత డిసెంబరులో ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. సాహిత్య అకాడమీ 2015వ సంవత్సర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక ఫిక్కీ ఆడిటోరియంలో నిర్వహించారు. ప్రముఖ రచయిత, పద్మభూషణ్ గోపీచంద్ నారంగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. 24 భారతీయ భాషల్లో ఉత్తమ రచనలు చేసిన రచయితలకు ఈ అవార్డులు అందజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, కార్యదర్శి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

అవార్డు స్వీకరించిన సందర్భంగా రచయిత్రి ఓల్గాను కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మంగళవారం ఇక్కడ కలిసి అభినందించారు. నాలుగు దశాబ్దాల కిందటే సహజ, స్వేచ్ఛ వంటి నవలల ద్వారా తెలుగు సాహిత్యంలో ఆమె తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ‘విముక్త’ రచించినందుకు ఓల్గాకు, అదే నవలను తమిళంలో ‘మిత్చీ’ పేరుతో అనువదించిన తమిళ రచయిత్రి గౌరీ కిరుబనందన్‌కు కూడా సాహిత్య అకాడమీ అనువాద అవార్డు లభించడం విశేషమని తెలిపారు.

మరిన్ని వార్తలు