30 శాతం మంది నకిలీ లాయర్లే!

25 Feb, 2016 11:13 IST|Sakshi
30 శాతం మంది నకిలీ లాయర్లే!

దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారు కనీసం 30 శాతం మందికి నకిలీ డిగ్రీలున్న విషయం బయటపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నకిలీ లాయర్లను వెతికి పట్టుకునేందుకు బీసీఐ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకప్పుడు న్యాయవాద వృతిని చేపట్టాలనుకున్నవారు బీసీఐ సర్టిఫికెట్‌తో రిజిస్టర్ అయితే సరిపోయేది. కానీ తాజాగా అమల్లోకి తెచ్చిన పద్ధతి ప్రకారం వెరిఫికేషన్ సమయానికి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారంతా బీసీఐ సర్టిఫికెట్‌తో పాటు పదోతరగతి, బోర్డు సర్టిఫికెట్లను, ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్‌లో తిరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు బీసీఐ ఛైర్మన్ చెప్పారు. లాయర్లు సమర్పించిన సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ సదరు విశ్వవిద్యాలయాలు, బోర్డుల సహాయంతో  2016 సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందని మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. బీసీఐ రిజిస్ట్రేషన్ ఉండి ఐదేళ్లుగా ప్రాక్టీస్‌లో లేని న్యాయవాదులను పరిశీలనలో భాగంగా లాయర్లుగా గుర్తించినా.. తిరిగి ప్రాక్టీస్ కు మాత్రం అనుమతించే అవకాశం లేదన్నారు. ఈ నూతన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో బార్ కౌన్సిల్... వివిధ రాష్ట్రాల్లో న్యాయవాదుల అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి న్యాయవాదికీ అకాడమీ సర్టిఫికెట్ తప్పనిసరి అని, దాంతో ఏ కోర్టులోనైనా  ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుందని మిశ్రా చెప్పారు.

దేశంలో 20 శాతం లాయర్లు సరైన 'లా' డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని బీసీఐ ఛైర్మన్ గతేడాది చెప్పారు. అకాడమీలను ప్రారంభించి, నకిలీ న్యాయవాదులను నిర్మూలించేందుకు సహకరించాలని అప్పట్లో కేంద్రాన్ని నిధుల కోసం ఆశ్రయించారు. అయితే అప్పటికే న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చే జ్యుడీషియల్ అకాడమీలను పొడిగిస్తూ, న్యాయవాదులకు, న్యాయవ్యవస్థలో పనిచేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ ఆఫీసర్ల వంటి వారికి కూడా తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, న్యాయ శాఖ బీసీఐకి హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు