ఆగని పాక్ దుశ్చర్య

6 Jan, 2015 02:29 IST|Sakshi
ఆగని పాక్ దుశ్చర్య
  • భారీగా మోర్టారు బాంబు దాడులు
  • బీఎస్‌ఎఫ్ జవాను మృతి
  • జమ్మూ:సరిహద్దులోని భారత భద్రతా శిబిరాలు, పౌర ఆవాస ప్రాంతాలపై పాకిస్తాన్ మళ్లీ భారీ మోర్టారు బాంబుల దాడి ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాను చనిపోయారు. గత వారం రోజుల్లో పాక్ బలగాల మోర్టారు బాంబుల దాడి, కాల్పుల్లో మొత్తం నలుగురు జవాన్లు, ఒక మహిళ చనిపోయారని, భారత ఎదురు కాల్పుల్లో ఐదుగురు పాక్ రేంజర్లు, ఒక బాలిక మృతిచెందారని ఉన్నతాధికారులు చెప్పారు. సరిహద్దు వెంట శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ ఎటువంటి కాల్పుల ఉల్లంఘనలూ జరగలేదు.

    ‘అయితే సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సాంబా, కతువా జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ రేంజర్లు మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించారు. తొలుత స్వల్ప కాల్పులతో మొదలు పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు భారత సరిహద్దు శిబిరాలపై భారీ స్థాయిలో మోర్టారు బాంబులతో కాల్పులు మొదలుపెట్టారు’ అని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో సాంబా సెక్టార్‌లో విధుల్లో ఉన్న దేవేందర్‌కుమార్ అనే బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చనిపోయారని చెప్పారు.
     
    పౌర ఆవాసాలు లక్ష్యంగా పాక్ షెల్లింగ్...

    పాక్ దళాలు ఉద్దేశపూర్వకంగానే పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని మోర్టారు బాంబులు కాలుస్తున్నాయని.. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సరిహద్దులోని భారత గ్రామాలన్నిటిపైనా పాక్ బలగాలు మోర్టారు షెల్లింగ్ జరుపుతున్నాయని.. భారత భూభాగంలోని 57 గ్రామాల్లో ఐదు వేల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో ఉన్నారని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వివరించారు.

    ‘పాక్ ప్రయోగిస్తున్న షెల్స్ భారత భూభాగంలో మూడు, నాలుగు కిలోమీటర్ల వరకూ వచ్చిపడుతున్నాయి’ అని  చెప్పారు. కాగా, సరిహద్దులో భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో తమ పౌరులిద్దరు చనిపోయారని పాక్ ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం కొనసాగుతోంది.

    సాంబా, కతువా జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి గత ఐదు రోజుల్లో 3,500 మందికి పైగా ప్రజలు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు, సహాయ శిబిరాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. కతువా జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో 1800 మంది ఉన్నారు. సాంబా జిల్లాలో వేయి మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. వీరికి వసతి, సాయం అందించేందుకు భారత సైనిక దళం ఆపరేషన్ ‘హాస్లే బులంద్’ పేరుతో కృషి చేస్తోంది.
     

మరిన్ని వార్తలు