'నా అంతరాత్మ క్షోభిస్తోంది.. నిజాలు చెబుతున్నా'

8 Feb, 2017 08:17 IST|Sakshi
'నా అంతరాత్మ క్షోభిస్తోంది.. నిజాలు చెబుతున్నా'

చెన్నై: తమిళనాడు చెన్నై తీరంలోని మాజీ సీఎం జయలలిత సమాధి వద్ద దాదాపు గంటసేపు హైడ్రామా నడిచింది. జయ సమాధి వద్ద మాజీ సీఎం పన్నీర్ సెల్వం దాదాపు గంటసేపు మౌనంగా కూర్చున్నారు. అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. తనను సీఎం పదవి నుంచి బలవంతం రాజీనామా చేయించారని చెప్పారు. రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సమావేశానికి తనను ఆహ్వానించలేదని, నిరంతరం తనను అవమానించారని, కించ పరిచారని సంచలన నిజాలు వెల్లడించారు. తాను మంచి పనులు చేస్తే కొందరికి నచ్చదని, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.

 

'అమ్మ జయలలితకు నివాళి అర్పించేందుకు సమాధి వద్దకు వచ్చాను. ప్రియతమ నేతకు నివాళులు అర్పించాను. పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు జయ స్ఫూర్తితో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. నిజాలు చెప్పాలని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది. అపోలో ఆస్ప్రతిలో చేర్పించేనాటికే ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఆ తర్వాత 70 రోజులుగా ఆస్పత్రిలో ఇదే పరిస్థితి కొనసాగింది' అని చెప్పారు.

'అమ్మ అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు పార్టీని రక్షించాలని ఆమె నన్ను సూచించింది. పార్టీ బాధ్యతలు నన్ను స్వీకరించాలని ఆమె కోరారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఎవరో ఒకరిని ఎంపిక చేయమన్నారు. ప్రజలు అంగీకరిస్తారని జయలలిత చెప్పారు. జయలలిత లేని పక్షంలో మాత్రమే సీఎం పదవిని స్వీకరించాను. పార్టీని అగౌరవ పరచలేకే బాధ్యతలు చేపట్టాను. వార్దా తుఫాను సమయంలో గట్టిగా పనిచేశాను. ఇప్పుడు నా అంతరాత్మ క్షభిస్తోంది.. అందుకే నిజాలు చెప్తున్నా. స్పీకర్ మధుసూదన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి చేయాలని అమ్మ నన్ను కోరారు. నేను అందుకు ఒప్పుకోలేదు' అని పన్నీర్ సెల్వం వివరించారు.

మరిన్ని వార్తలు