మునగ చెట్టు ముళ్లు | Sakshi
Sakshi News home page

మునగ చెట్టు ముళ్లు

Published Tue, Feb 7 2017 10:17 PM

మునగ చెట్టు ముళ్లు

మునగ చెట్టుకు ముళ్లుండవు.
కానీ, పొగడ్తలతో వివాహితలు మునగ చెట్టు ఎక్కితే
మూడుముళ్లకు ముళ్లు గుచ్చుకోవడం ఖాయం!
వివాహితను ప్రలోభపెట్టి మునగ చెట్టు ఎక్కించే మాయల పకీర్లు ఉంటారు.
వారికి గట్టి చట్టమే ఉంది.
సమాజంలో ఆలాంటి గొంగళి పురుగులను ఏరిపారేసే ఆ సెక్షన్‌.. 498.
సంసార జీవితం పవిత్రమైనది.
అనూహ్యమైన బాధ్యతలు కలిగివున్నది.
అయితే.. భార్యాభర్తా...
సంసార సాగరంలో కొట్టుకుపోతూ బాధ్యతల్ని తప్ప బంధాన్ని బలపరచుకోకపోతే..
వశపరుచుకునే దుర్మార్గులు ఉంటారు.
నక్కల్లా పొంచి ఉంటారు.
బంగారు తల్లులూ జాగ్రత్త!


‘గీతగారు.. గ్యాస్‌ అయిపోయింది. కాఫీ కలిపి ఇవ్వగలరా ప్లీజ్‌ ?’ అంటూ పాలగిన్నెను అందించాడు పక్కపోర్షన్‌ బ్యాచ్‌లర్‌ అరవింద్‌. ‘అయ్యో.. తప్పకుండా! దానికి అంత ప్లీజ్‌ వద్దు.. పాలూ వద్దు!’ అంటూ నవ్వుతూ వంటింట్లోకి వెళ్లిపోయింది గీత. కొంటెగా నవ్వుతూ చేత్తో తలవెనకాల జుత్తును చెదుర్చుకుంటూ పాలగిన్నెతో తన పోర్షన్‌లోకి వచ్చాడు అరవింద్‌.   అయిదు నిమిషాల్లో కాఫీ కలుపుకొని అతని తలుపు కొట్టింది గీత. వచ్చి, కాఫీ కప్పు అందుకుంటూ ఎర్రటి గాజులతో మెరుస్తున్న పచ్చటి చేతిని పరిశీలనగా చూశాడు. ‘అసలు మీరిక్కడ ఉండాల్సిన వారు కాదండీ బాబూ అంటే వినరు!’ అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా! గత నాలుగు నెలల్లో ఇలాంటి కితాబులు చాలానే ఇచ్చాడు అరవింద్‌ గీతకు. అయినా మొదటిసారి విన్నంత సంభ్రమం చెందింది గీత. ‘అరవింద్‌గారూ మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారండీ..’ అంది సిగ్గుపడుతూ. ‘నిజాలు చెబితే నమ్మరండీ.. మోడలింగ్‌ అవకాశాల కోసం నా దగ్గరకి ఎంత మంది అమ్మాయిలొస్తున్నారో చూశారుగా? వాళ్లలో ఎవరికైనా మీ అందం ఉందాండీ.. మీకున్న ఆకర్షణ కనపడుతోందా? మీ స్మైల్‌.. మీ లుక్స్‌.. అబ్బ.. ఎన్నని చెప్పమంటారు? ఈ చిట్టా విప్పితే చాంతాడంత ఉంటుంది. నాకేమో నిజాలు కక్కడం అలవాటు. మీకేమో అవి పొగడ్తలుగా వినపడ్తాయి. తప్పు నాదా అండీ?’ ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ అన్నాడు. ‘అంతలేదండీ’ అంటూ ఇంట్లోకి వచ్చేసింది గీత.

భర్తకు కనిపించని అందం!
అద్దంముందు నిలబడింది! అంత అందంగా ఉందా తను? కుడి వైపుకి, ఎడమ వైపుకి కదులుతూ మార్చి మార్చి చూసుకుంటోంది తనను తాను!  నిజంగా తాను అరవింద్‌ చెప్పినంత అందమైందా? పెళ్లయిన ఈ  రెండేళ్లలో తన భర్త ఒక్కసారి కూడా తనను అలా పొగడలేదు. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో నీలంరంగు చీర కట్టుకుంటే ‘ఈ నీలంరంగు చీరలో ఎంత బాగున్నావో తెలుసా నీలవేణి’ అంటూ మోహంగా తనను హత్తుకున్నాడు. అంతే! మళ్లీ ఎప్పుడూ అలాంటి కాంప్లిమెంట్‌ వినలేదు. చీరవల్లే తను బాగా కనిపించాడన్నాడు! అరవింద్‌  అయితే నా వల్లే  చీరకు అందమంటాడు. అతడలా మొహం ముందే పొగుడ్తుంటే భలే సిగ్గేస్తుంది తనకు.    ‘ఆ వాలు జడను నడుం పైకి కట్‌ చేయించండి.. ఎంత గ్లామర్‌ పెరుగుతుందో?’ అని చెప్తాడు. ‘అంత పెద్ద బొట్టు వద్దు.. చిన్న స్టిక్కర్‌ను ఐబ్రోస్‌ మధ్య అతికించి  చూసుకోండి మీ మొహాన్ని.. చందమామలా ఉంటారు’ అంటూ సీరియస్‌గా సలహా ఇస్తాడు. ‘అసలు మీరు మోడల్‌ కావాల్సిన వారండీ.. ఇల్లాలుగా పొగచూరిపోతున్నారు’ అన్నాడు ఒకసారి. తను చురుగ్గా చూసింది.

బయటి కళ్లకు బ్యూటిఫుల్‌
‘ఒట్టండీ బాబూ.. మీకేం తక్కువ? ఆ ఒడ్డు, పొడుగు.. తేనె, పసుపు రంగరించినట్టుండే మీ ఒంటి రంగేంటండీ.. మతి పోతుంది. గీతగారూ... మరీ చనువు తీసుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క సలహా.. ఈ మిడిల్‌క్లాస్‌ బతుకులతో ఏం బావుకుంటారు? చాలామందికి ఇవ్వని అందాన్ని దేవుడు మీకిచ్చాడు. వంటిట్లో ఫ్రైలు చేయమని, భర్తకు సేవకు అంకితమవమని కాదండీ.. మిమ్మల్ని మీరు ప్రూవ్‌చేసుకోమని. సోషల్‌లైఫ్‌ను ఎంజాయ్‌ చేయమని. నేను యాడ్‌ ఏజన్సీ పెట్టిన ఈ ఎనిమిదేళ్లలో మీ అంత బ్యూటిఫుల్‌ లేడీని చూడలేదు. నిజం.. నన్ను నమ్మండి. అవకాశాల కోసం ఎందరో ఎవరెవరి కాళ్లో పట్టుకుంటారు. మీరేంటండీ బాబూ.. అవకాశం ఉంది తీసుకోండి అంటే కదలరు.. మెదలరు?’.. రెండు రోజుల కిందట అరవింద్‌ అన్న మాటలు గుర్తొచ్చాయి గీతకు ఒక్కసారిగా. అవి విన్నప్పుడు మామూలుగానే తీసుకున్నా తనకు తెలీకుండానే మనసులో బాగా నాటుకుపోయాయి. అద్దంలో తనను తాను మళ్లీ ఒకసారి పరిశీలనగా చూసుకుంది. అరవింద్‌ చెప్పినంత అందంగానే కనపడింది.

పద్దులు తప్ప ముద్దుల్లేవు!
పక్షంరోజులుగా పదేపదే అరవింద్‌ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి గీతకు. పెళ్లయినప్పటి నుంచీ చూస్తోంది.. భర్త తీరును. ఆయన పనేదో ఆయన చేసుకోవడం తప్ప తన మీద ఇంతకూడా ధ్యాసలేదు. ఇద్దరం చాలా సరదాగా గడపాలనే ఇప్పుడప్పుడే పిల్లల్ని కూడా వద్దనుకుంది. కాని ఏం లాభం? ఓ ముద్దు లేదు.. మురిపెం లేదు! ఎంతసేపూ ఆఫీస్‌.. ఇల్లూ.. తప్ప, పక్కన అందమైన భార్య ఉంది దాని ముచ్చట తీర్చాలి.. కనీసం ఓ కాంప్లిమెంట్‌ ఇవ్వాలన్న స్పృహ కూడా లేదు. అసలు తనకు అప్పుడే పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదు. తను చాలా యాంబీషియస్‌. బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరూ వెళ్లని ఫీల్డ్‌లోకి వెళ్లి వెలిగిపోవాలనుకుంది. చిన్నప్పటి నుంచీ అలాంటి కలల్నే కన్నది. హైస్కూల్లో ఉన్నప్పుడు ఎయిర్‌హోస్టెస్‌ కావాలనుకుంది. ఇంటర్‌లోకి వచ్చాక మోడల్‌ కావాలనుకుంది. హైఫై లైఫ్‌ స్టయిల్‌.. సోషల్‌ మూవింగ్‌.. ఎన్ని ఊహలు.. పెళ్లితో అన్నిటికీ చెక్‌ పెట్టించాడు నాన్న. పెళ్లయ్యాక అసలు అలాంటి కలల కనడానికి కూడా ధైర్యం లేకుండా పోయింది. ఛీ..ఛీ.. ఇంత పేలవమైన లైఫ్‌ స్టయిలా? తనవల్ల కాదు!

చిరాకులూ పరాకులూ...
‘వచ్చే సండే అమ్మావాళ్ల దగ్గరకు వెళ్తున్నాం. అక్కయ్య, అన్నయ్య వాళ్ల ఫ్యామిలీ కూడా వస్తోంది’  ఉదయం ఆఫీస్‌కి రెడీ అవుతూ చెప్పాడు మురళి.‘ఈ బతుక్కి అంతకన్నా శుభవార్త వినే చాన్స్‌ ఉందా? ఏ సిమ్లాకో, కులూమనాలీకో మనకు టికెట్స్‌ బుక్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేస్తారనేం ఎక్స్‌పెక్ట్‌ చేయనులెండి’ విసురుగా అన్నది గీత.. ఆమె చేతిలోఉన్న పనిలోనూ     ఆ విసురు కనిపించింది.విస్తుపోయాడు గీత ప్రవర్తనకు. ఏంటో ఈ మధ్య ఉన్నదానికి లేనిదానికీ చిరాకు పడుతోంది. తనేం మాట్లాడినా వ్యంగ్యంగా తోసిపారేస్తోంది. వీసమెత్తు విలువ కూడా ఇవ్వట్లేదు. ప్రతిసారి తనను ఓ అసమర్థుడిగా రుజువు చేయడానికి ప్రయత్నిస్తోంది. బాధపడ్డాడు. ఎన్నడూలేంది ఓ నెలగా ఏదో తెలియని మార్పు భార్యలో. మరీ ఈ పదిహేనురోజుల్లో ఇంకా కనపడుతోంది. ఎంతసేపూ పక్క పోర్షన్‌ అరవింద్‌తో తనను పోల్చే ప్రయత్నం చేస్తోంది..’.. అనే ఆలోచనలు, ఆ పూట గీత ప్రవర్తన మురళిని డిస్టర్బ్‌ చేశాయి. ఆ మూడ్‌తోనే ఆఫీస్‌కి బయలుదేరాడు.
ఆ తర్వాత నెలా ఇలాంటి చిరాకులు, పరాకులు, గొడవలతోనే గడిచింది.  ఇంకోవైపు అరవింద్‌ పొగడ్తలు, అతడిచ్చే అభయంతో అతని మీద విపరీతమైన నమ్మకం పెరిగింది గీతకు. దాంతో వాస్తవాన్ని బేరీజు వేసుకునే, విశ్లేషించుకునే శక్తిని కోల్పోయింది.

గీత.. గుమ్మం దాటింది!
ఓ రోజు నిర్ణయం తీసేసుకుంది గీత. అరవింద్‌తో కలిసి ముంబైకి వెళ్లింది. టాప్‌ మోడల్‌ అయిపోదామని! ముంబైలో తన ఫ్రెండ్‌ ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేంత వరకే గీతను అరవింద్‌ ఓ రాణిలా చూశాడు. ఇంట్లోకి చేరిన  మరుక్షణం నుంచే కనీసం మనిషిలా చూడ్డం కూడా మానేశాడు.  స్నానం చేసి రమ్మని ఆర్డర్‌వేశాడు. అతడి కరుకుదనానికి బిత్తర పోయింది. వచ్చాక అర్థనగ్నంగా ఉండే బట్టలు ఇచ్చాడు వేసుకోమ్మని. కెమెరా సెట్‌ చేసుకున్నాడు. అభ్యంతరకరమైన ఫోటో షూట్‌ కోసం ఆమెను బలవంతపెట్టాడు. వినకపోతే అసభ్యంగా తిట్టాడు, కొట్టాడు. అయినా ససేమీరా అంది గీత. రెండు గంటల్లో వస్తా.. ఆపాటికి రెడీ కాకపోతే మర్యాదగా ఉం డదు అంటూ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. నిస్సహాయంగా ఉన్న గీతకు ఆ ఇంట్లోని వంటమనిషి సహాయం చేసింది. ఆ ఇంట్లోంచి బయటకు తప్పించింది.

మాటల పకీర్‌ దొరికాడు
సాయంత్రం ఆఫీస్‌ నుంచి వచ్చిన మురళికి భార్య కనిపించలేదు. ‘నన్ను వెదకొద్దు.. నేను అనుకున్నది సాధించి నేనే వస్తాను’ అన్న స్లిప్‌ మాత్రం కనిపించింది. హతాశుడయ్యాడు. కారణం ఎవరో ఇట్టే గ్రహించాడు. పోలీసులకు రిపోర్ట్‌ చేశాడు. ట్రేస్‌ చేసిన పోలీసులకు గీత త్వరగానే దొరికింది. ఆమె ద్వారా అరవిందూ చిక్కాడు. కటకటాల వెనక్కి వెళ్లాడు.


వివాహితను బట్టలో వేసుకుంటే కటకటాలే!
 ఈ కేస్‌ ఐపీసీ సెక్షన్‌ 498 కిందకు వస్తుంది. వివాహితను పొడిగి, భ్రమల్లోకి నెట్టి, ప్రలోభపెట్టి భర్త నుంచి తీసుకెళ్లిపోయి ఆమెను తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం లేదా నరక కూపంలోకి తోయడం ఈ సెక్షన్‌ ప్రకారం నేరం. దీనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.  – ఇ. పార్వతి అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్‌

– సరస్వతి రమ

Advertisement
Advertisement