మళ్లీ ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి!

26 Feb, 2018 09:25 IST|Sakshi

పనాజీ : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారు. డీహైడ్రేషన్‌, రక్తపోటు (బీపీ) పడిపోవడంతో ఆయన ఆదివారం రాత్రి గోవా మెడికల్‌ కాలేజీలో చేరారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న పారీకర్‌ (62)ను అమెరికా తరలించి చికిత్స అందించే అవకాశముందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథనాలను పారీకర్‌ను చికిత్స అందిస్తున్న ఆస్పత్రి తోసిపుచ్చింది. ప్రస్తుతం సీఎం కోలుకుంటున్నారని తెలిపింది.

‘డీహైడ్రేషన్‌ కారణంగా సీఎం వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరారు. ఆయన త్వరితగతిన కోలుకుంటున్నారు’ అని గోవా సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. స్పెషలిస్ట్‌ డాక్టర్లు సీఎం ఆరోగ్యపరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే మీడియాకు తెలిపారు. వీల్‌చైర్‌ మీద సీఎం పారీకర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఫిబ్రవరి 15న అనారోగ్యం కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో పారీకర్‌ చేరిన సంగతి తెలిసిందే. పాన్‌క్రియాటిస్‌ (క్లోమ సంబంధ) అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 22న ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ అయి.. గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు