దీపావళి వేళలను ధిక్కరిస్తాం

2 Nov, 2018 12:04 IST|Sakshi

బాణసంచా కాల్చే వేళలు ప్రజాభీష్టమే

సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనల ధోరణి

సమంజసమే అంటున్న అతికొద్ది మంది

బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు కట్టుబాట్లను విధించడంపై అనేకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండుగంటలు కేటాయించడంపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలుఅసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. రోడ్లలో వెళ్లే వాహనాలు కాలుష్యపు పొగనువదలడం లేదా, కేవలం రెండుగంటలే వాహనాలు నడపాలని షరుతు విధించడం సాధ్యమా అని పలువురు దుయ్యబట్టారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: బాణసంచా కాల్చడం ద్వారా ఏడాదికోసారి సందడి చేసుకునే దీపావళి పండుగపై షరుతులు ఏంటి, బాణసంచా కాల్చేందుకు వేళల కట్టుబాటేంటి.. అన్నింటినీ ధిక్కరిస్తాం.. అంటున్నారు పలువురు పౌరులు.      వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు అందరూ కలిసి జరుపుకోవడమే దీపావళి ప్రత్యేకతని చెన్నై టీ.నగర్‌కు చెందిన స్వప్న అన్నారు. దీపావళి వేళల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం చోద్యంగా ఉందని ఆమె అన్నారు. అనవసరమైన ఇలాంటి కట్టుబాట్ల వల్ల మరింత కసిగా అదనపు వేళల్లో బాణసంచా కాల్చాలనే భావన వస్తోందని చెప్పారు. హిందువులకు అనాదిగా వస్తున్న పండుగల్లో దీపావళి కూడా ఒకటి దాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానించాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీదివ్య అనే ఇంజినీరు సుప్రీం తీర్పును సమర్థించారు. దీపావళి కాలుష్యం చిన్ననాటి నుంచే తెలుసు. ఇకనైనా ప్రజల్లో మార్పురావాలి.

సినిమాలకు, షికార్లకు వెళ్లడం ద్వారా దీపావళి పండుగ చేసుకోవడం అలవాటు కావాలని అన్నారు. దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చే హక్కును న్యాయస్థానాలు హరించరాదని అముద అనే యువతి అన్నారు. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల గడువును పాటించడం మంచదని వైష్ణవి అనే పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ రోడ్లపై ప్రతినిత్యం వాహనాలు పరుగులు పెడుతుంటే ఏ అధికారి పట్టించుకోవడం లేదు, ఒక్క దీపావళి రోజున కాలుష్యాన్ని అరికడుతారా అని మేట్టుపాళయంకు చెందిన కన్నన్‌ విమర్శించారు. ఇపుడు దీపావళి బాణసంచాకు రెండుగంటలు విధించారు. భవిష్యత్తులో ఇక మిగిలిన పండుగలకు ఎలాంటి నియమ నిబంధనలు మీదవచ్చి పడతాయోనని భయంగా ఉందని జ్యోతిక అనే కళాశాల విద్యార్థిని ఆందోళన వ్యక్తంచేశారు.

దీపావళి అంటేనే టపాసులు అవిలేకుండా పండుగా అని  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించడం సాధ్యం కాదు, నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వారిని  తెల్లవారుజామున 4 గంటలకు లేపికూర్చునబెట్టి టపాసులు కాల్చేదెలా అని  కూలీ కార్మికుడు సుబ్రమణియం ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చెప్పింది అంటే పిల్లలకు అర్థం అవుతుందా, వారు వినిపించుకుంటారా అని నిలదీశారు. దీపావళి పండుగకు ఐదురోజులు సెలవులు వచ్చాయి, అయితే రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలనే నిబంధన బాధాకరమని ఆదికేశవన్‌ అనే పాఠశాల విద్యార్థి అన్నాడు. రెండుగంటల షరతు వల్ల బాణసంచా తయారీదారులు తీవ్రంగా నష్టపోతారు, ప్రజలు సరదాగా పండుగ చేసుకోలేరు, సుప్రీంకోర్టు మరోసారి ఆలోచిస్తే మంచిదని కడలూరుకు చెందిన తంగ ఆనందన్‌ సూచించారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు బాణసంచా వేళలను కట్టడి చేయడం స్వాగతించదగిందే, అయితే కట్టడి చేయడం అసాధ్యమని వేలూరుకు చెందిన డాక్టర్‌ శశిరేఖ అన్నారు. బాణసంచా కాల్చే హక్కులను కాలరాయడమేనని నాగర్‌కోవిల్‌కు చెందిన పాల్కని అన్నారు. రెండుగంటలు మాత్రమే టపాసులు కాల్చాలని చెప్పడం పిల్లల ఆనందాన్ని హరించడమేనని ఆమె అన్నారు.

వేళల పునఃపరిశీలన చేయాలి  
కేవలం రెండే గంటల నియమాన్ని ప్రజలు అంగీకరించరని కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. వీధి వీధికి పోలీసులను పెట్టి వ్యవధిని పర్యవేక్షిస్తారా అని ఆయన  ఎద్దేవాచేశారు. దీపావళి అనేది సంతోషంగా జరుపుకునే పండుగ, సంతోషంగానే సాగనివ్వండని అన్నారు. వ్యవధిని పునఃపరిశీలించాలని వీసీకే అధినేత తిరుమావళవన్‌ కోరారు. బాణ సంచా వేళలను పెంచాలని సమత్తువ మక్కల్‌ కట్చి అధినేత, నటుడు శరత్‌కుమార్‌ కోరారు.

పుదుచ్చేరి ఆఫర్‌
దీపావళి పండుగను పురస్కరించుకుని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు పలు ఆఫర్లను అందజేసేందుకు సిద్ధమైంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు, చక్కెర అందిస్తున్నారు. అలాగే రేషన్‌కార్డుదారులకు కిలో చక్కెర, కొత్త బట్టల కొనుగోలుకు రూ.1000ల నగదు పంపిణీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు