సామాన్యుడికి ‘పెట్రో’ వాత

6 Jul, 2019 04:04 IST|Sakshi

గతేడాది ఎన్నికల ముందు సుంకాలను తగ్గించిన కేంద్రం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్‌లో వినియోగదారులకు షాకిచ్చింది. లీటర్‌ పెట్రోల్, డీజిల్‌లపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని రూపాయి మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పార్లమెంటులో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఈ మేరకు ప్రకటన చేశా రు. అలాగే ‘రోడ్లు–మౌలిక వసతుల సెస్‌’ కింద లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై మరో రూపాయిని అదనంగా పెంచుతున్నామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.5 వరకూ, లీటర్‌ డీజిల్‌ ధర రూ.2.3 వరకూ పెరిగింది. ఈ పెంపు కారణంగా ఖజా నాకు ఏటా రూ.28,000 కోట్ల ఆదాయం చేకూరనుంది.

చమురు దిగుమతులపై రూపాయి పెంపు.. 
కేంద్రం నిర్ణయంతో లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.70.51కు, ముంబైలో 76.15కు చేరుకోగా, లీటర్‌ డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.64.33కు, ముంబైలో రూ.67.40కు చేరుకుంది. అలాగే భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురుపై టన్నుకు రూపాయి మేర సుంకాన్ని పెంచుతూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనికారణంగా ఖజానాకు రూ.22 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకూ ముడిచమురు దిగుమతులపై టన్నుకు రూ.50 మేర జాతీయ విపత్తు అగంతుక నిధి(ఎన్‌సీసీడీ) కోసం వసూలుచేస్తున్నారు. భారత్‌ విదేశాల నుంచి ఏటా 220 మిలియన్‌ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.98 ఎక్సైజ్‌ సుంకాన్ని, లీటర్‌ డీజిల్‌పై రూ.15.83 సుంకాన్ని కేంద్రం వసూలుచేసినట్లు అయింది. 2018, అక్టోబర్‌లో ఎన్నికల సందర్భంగా అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పెట్రో ఉత్పత్తులపై లీటర్‌కు రూ.1.50 మేర సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు