కేరళకు ఇండియన్‌ రైల్వే భారీ విరాళం!

22 Aug, 2018 11:53 IST|Sakshi

తిరువనంతపురం : భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళను ఆదుకునేందుకు భారత రైల్వే సంస్థ ముందుకొచ్చింది. పునరావాస చర్యల్లో కేరళకు అన్నివిధాల సహకరిస్తోంది. ఇక, వరద విపత్తులో చిక్కుకున్న కేరళకు అండగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని రైల్వేమంత్రి పీయూష్‌ గోయెల్‌ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 జోన్లలో 13 లక్షలమంది రైల్వే ఉద్యోగులు ఉన్నారు. వీరు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే.. దాదాపు రూ. 200 కోట్ల భారీ సాయాన్ని అందించినట్టు అవుతుంది.

మరోవైపు రైల్వేస్‌కు చెందిన పుణే డివిజన్‌ నిర్విరామంగా కేరళకు సాయం అందిస్తోంది. గతవారం కేరళకు 29 వ్యాగన్ల మంచినీటిని సరఫరా చేసిన పుణె రైల్వే డివిజన్‌.. తాజాగా మంగళవారం నాలుగు టన్నుల సహాయక సామాగ్రిని తిరువనంతపురం పంపింది. వర్షాలతో మూతపడిన కొచ్చి ఎయిర్‌పోర్టు ఈ నెల 26వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కేంద్రం తరఫున సహాయక చర్యల్లో నిమగ్నమైన కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్‌ మంగళవారం రాత్రి చాంగనచెర్రీ సహాయక శిబిరంలో బస చేశారు. సహాయక శిబిరంలో తాను పడుకున్న ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు.

2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వండి!
వరదల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యల కోసం రూ. 2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ సీఎం పినరయి విజయన్‌ కోరారు. కేరళకు కేంద్రం ప్రకటించిన రూ. 500 కోట్ల సహాయం సరిపోదని, కేంద్ర సాయాన్ని రూ. 2వేల కోట్లకు పెంచాలని కోరుతూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మరోవైపు యూఏఈ ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు