పట్టాలపైకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

15 Feb, 2019 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రూపొందించడం వెనుక డిజైనర్లు, ఇంజనీర్ల కృషిని అభినందిస్తున్నానని ప్రధాని మోదీ ప్రశంసించారు.

నాలుగున్నరేళ్ల తమ పాలనలో రైల్వేలను మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. ఈ అత్యాదునిక రైలును చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో కేవలం 18 నెలల్లో తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు. ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇతర అధికారులతో కలిసి కలియతిరుగుతూ రైలును పరిశీలించారు.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్‌ 18కు ఇటీవల వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరును నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈనెల 17 నుంచి ఢిల్లీ-వారణాసి మధ్య వారానికి ఐదు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లుంటాయి. ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్‌ డోర్‌లు, జీపీఎస్‌ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. తాజా వంటకాలను ప్రయాణీకులకు అందించేందుకు ప్రతి కోచ్‌లో పాంట్రీని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు