ప్రపంచానికి భారత్ ఆశాకిరణం

28 Feb, 2016 01:10 IST|Sakshi
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం

ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ
♦ గ్రామాలు, పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం
♦ ఇజ్రాయెల్‌లా భారత వ్యవసాయ రంగం
♦ {పధాన సేవక్ అయ్యాక అవినీతిని కడిగేస్తున్నాం
 
 బెళగావి(కర్ణాటక): ప్రపంచ ఆర్థిక రంగానికి భారతదేశమే ఆశాకిరణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, గ్రామీణ ప్రాంతాల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కిసాన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకుతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో మెరుగుపడుతున్న పరిస్థితులను చూసి అద్భుతమైన రేటింగ్స్ ఇస్తున్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉన్నా.. భారత్ వాటన్నింటినీ తట్టుకుని బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు.

కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ‘మేం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశమంతా అవినీతి వేళ్లూనుకుపోయింది. నేను ప్రధాన సేవక్‌గా వచ్చిన తర్వాత దేశంలో అవినీతికి తావు లేదు. విపక్షాలు ఎన్ని విషయాలను వివాదం చేసినా.. అవినీతి విషయంలో మాత్రం నోరువిప్పటం లేదు’ అని మోదీ అన్నారు. యూరియా నల్లబజారును అడ్డుకుంటున్నందుకు పలువురు అవినీతిపరులకు తాను కంట్లో నలుసులా మారానని అందుకే దేశాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వ్యవసాయ, తయారీ, సేవారంగాల్లో అభివృద్ధి తీసుకువచ్చి.. పేదలు, రైతులు, నిరుద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ నినాదంతో వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ తరహా ఫలితాలు సాధిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులు ఏ క్షణంలోనూ కన్నీరు పెట్టరాదనే సంకల్పంతో తాను వినూత్న రీతిలో పథకాలు రూపొందిస్తున్నాన న్నారు. రాబోయే రోజుల్లో దేశంలో రైతే రాజుగా కొనసాగేలా ప్రభుత్వం అన్ని వనరులు సమకూరుస్తుందన్నారు. దేశ చరిత్రలో ప్రప్రథమంగా రైతుల కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం కర్ణాటక రైతులకు తామిచ్చినంతగా నిధులివ్వలేదన్నారు. దళారుల్లేకుండా జన్‌ధన్ ఖాతాల ద్వారా నేరుగా ప్రజల వద్దకే నిధులు చేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తదితర నేతలు పాల్గొన్నారు. కాగా, సభాస్థలికి సమీపంలోని వాహనాల పార్కింగ్ వద్ద ఉన్న ఎండు గడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించటంతో కలకలం రేగింది. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక యంత్రాలు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశాయి.

>
మరిన్ని వార్తలు