Garba Dance: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు

7 Dec, 2023 08:50 IST|Sakshi

గుజరాత్‌కు చెందిన ప్రముఖ గర్బా నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్)జాబితాలో చేర్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారతదేశం నామినేట్ చేసింది. 

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పటేల్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్భా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్ధిల్లుతోంది. గుజరాత్‌కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది. ఈ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యతనిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపును తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. గుజరాత్ ప్రజలకు అభినందనలు’ అని పేర్కొన్నారు. గర్బా  అనేది ఒక నృత్య రూపకంగా ప్రాచుర్యం పొంది, సంప్రదాయాన్ని కలబోస్తూ, అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేదిగా నిలుస్తున్నదని యునెస్కో పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు?

>
మరిన్ని వార్తలు