మోదీ కానుకల వేలం

15 Sep, 2019 03:51 IST|Sakshi

ప్రదర్శనలో 2700 వస్తువులు

బేస్‌ రేట్‌ రూ. 200

అత్యధికం రూ. 2.5 లక్షలు

న్యూఢిల్లీ: ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం నిధుల సేకరణలో భాగంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న కానుకల వేలం ప్రక్రియ మొదలైంది. బహుమతుల ప్రదర్శన, వేలం పాటను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ శనివారం ప్రారంభించారు. శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700కుపైగా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయని, నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఏ)లో ఈ వస్తువులు శనివారం నుంచి అక్టోబర్‌ 3 వరకు  www.pmmementos.gov.in లో వేలం కొనసాగుతుందని తెలిపారు.

ఎన్‌జీఎంఏలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వేలం జరుగుతుందని, ప్రస్తుతం స్మృతి చిహ్నాలు పేరుతో 500 వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని పటేల్‌ తెలిపారు. ‘ప్రతి వారం ప్రదర్శించబడే మెమెంటోలు మార్చుతాం. పెయింటింగ్స్, మెమెంటోలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, సంప్రదాయ వాయిద్యాలతో సహా అనేక వస్తువులను ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. మెమెంటోల అత్యల్ప ధర రూ. 200 కాగా, అత్యధిక ధర రూ. 2.5 లక్షలు అని పటేల్‌ తెలిపారు. ‘నేను అందుకున్న బహుమతులను వేలంలో పెడతా. ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనాలని కోరుతున్నాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు