ఎఫ్‌బీలో రూ 10 కోట్లు దాటిన ప్రచార వ్యయం

7 Apr, 2019 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచాయి. సోషల్‌ మీడియాలోనూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల మద్దతుదారులు ఫేస్‌బుక్‌లో రూ 10 కోట్లకు పైగా ప్రకటనలపై ఖర్చు చేశారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకూ ఫేస్‌బుక్‌లో 51,810 రాజకీయ ప్రకటనలు కనిపించాయని, వీటి వ్యయం రూ 10.32 కోట్లని ఎఫ్‌బీ యాడ్‌ లైబ్రరీ నివేదిక పేర్కొంది. అంతకుముందు వారం (మార్చి 23 వరకూ)లో ఈ తరహా రాజకీయ ప్రకటనల సంఖ్య 41,974 కాగా 8.58 కోట్లు వాటిపై వెచ్చించారు. బీజేపీ నుంచి అధికంగా ఈ ప్రకటనలు వచ్చాయని వెల్లడైంది.

ఇక భారత్‌ కే మన్‌ కీ బాత్‌ పేరిట పాలక బీజేపీ, ఆ పార్టీ కార్యకర్తలు మార్చి 30 వరకూ 3700కు పైగా ప్రకటనల కోసం రూ 2.23 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ తన ఎఫ్‌బీ పేజీలో 410 ప్రకటనలకు గాను కేవలం రూ 5.91 లక్షలు ఖర్చు చేసింది. ఇక టీడీపీ ఎఫ్‌బీ ప్రకటనలపై రూ 1.58 లక్షలు, ఎన్‌సీపీ రూ 58,355 వెచ్చించాయి.

మరిన్ని వార్తలు