రాజీనామా చేస్తున్నారా? లేదా?

21 Jun, 2019 19:04 IST|Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుకు మొహాలీలో చేదు అనుభవం ఎదురైంది. మీరెప్పుడు రాజీనామా చేస్తారు సిద్ధూజీ అంటూ ఆయన పేరిట పోస్టర్లు వెలిశాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెనయిర్‌గా సిద్ధు పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించి తీరతారని, అలా జరగని పక్షంలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని శపథం చేశారు. అన్ని పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు.

కాగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్‌ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి కేంద్రమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో..‘ సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు వైదొలుగుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు మొహాలీలో పోస్టర్లు అంటించారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న సిద్ధు ప్రస్తుత పరిణామాలపై ఇంతవరకు స్పందించలేదు. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను విమర్శించిన ఆయన.. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశానికి హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు.

మరిన్ని వార్తలు