మోదీ నేర్చుకునే తీరు అద్భుతం

18 Mar, 2017 04:37 IST|Sakshi
మోదీ నేర్చుకునే తీరు అద్భుతం

ప్రధానిపై రాష్ట్రపతి ప్రశంసలు

ముంబై: కొత్త విషయాలను ప్రధాని మోదీ నేర్చుకునే తీరు తనను ఆకట్టుకుందని రాష్ట్రపతి ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి.. ‘పలు అంశాలను మోదీ తనదైన శైలిలో చక్కబెడతారు. తక్కువ కాలంలోనే ఈ స్థాయికి ఎదిగిన మోదీని ప్రశంసించకుండా ఉండలేం’ అని అన్నారు. ‘చరణ్‌ సింగ్‌ నుంచి చంద్రశేఖర్‌ వరకు అందరు ప్రధానులూ పార్లమెంటులో అనుభవం ఉన్నవారే. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రధాని పీఠాన్ని అధిరోహించిన  మోదీ.. విదేశీ వ్యవహారాలు, సంక్లిష్టమైన ఆర్థిక అంశాలపై పూర్తి పట్టు సాధించారు. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య, ఆంక్షలపై పనిచేసే జీ–20 గ్రూపుపై తన చాతుర్యంతో ప్రభావం చూపారు’ అని ప్రశంసించారు. యూపీ ఎన్నికల్లో విజయంతో వినమ్రతతో పనిచేయాలన్న మోదీ మాటలు హర్షించదగ్గవన్నారు.

అధికారంలో ఉన్న వాళ్లు ఆధిక్యతావాదానికి వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. పార్లమెంటు తరచూ వాయిదా పడటంపై ప్రణబ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాల పేరుతో విభేదాలు పెట్టుకున్నన్ని రోజులూ.. దేశం అభివృద్ధి పథంలో పయనించటం కష్టం. ఐకమత్యంతో ఉంటేనే గెలుస్తాం.’అని ప్రణబ్‌ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇద్దరు ప్రధానులు మన్మోహన్, మోదీ నుంచి తను చాలా నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. విపక్ష పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా సత్సంబంధాలున్న గొప్ప వ్యక్తి అని మాజీ ప్రధాని వాజ్‌పేయిని పొగిడారు. 

చిన్న చిన్న పార్టీలను కలుపుకుని ఆరేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వాజ్‌పేయికే దక్కుతుందన్నారు. ఇందిరా గాంధీని తన గురువుగా చెప్పుకున్న ప్రణబ్‌.. ఆమె ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులనుంచి రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవచ్చన్నారు. ఒక వ్యక్తి హీరోగా ఉండటం కంటే బలమైన ప్రతిపక్షం ఉండేదే అసలైన ప్రజాస్వామ్యమని నెహ్రూ బలంగా నమ్మి ఆచరణలో పెట్టారన్నారు. తాను ప్రజలనుంచే పుట్టానని వారిలోనే కలిసిపోతానని ప్రణబ్‌ అన్నారు. ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేస్తానన్నారు.కాగా, యూపీ ఎన్నికల్లో ఖబరస్తాన్‌పై శ్మశానం విజయం సాధించిందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు.

విద్యాసంస్థల్లో అసహనానికి తావులేదు
విద్యాసంస్థలో అసహనం, విద్వేషాలకు తావుండకూడదని.. అవి భిన్నాభిప్రాయాలకు వేదికలుగా ఉండాలని ముంబై వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్‌ స్వామినాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశాక మాట్లాడారు. దేశాభివృద్ధిలో విద్యారంగం కీలకపాత్ర పోషిస్తుందని.. విద్యాకోర్సులు పరిశ్రమల అవసరాలను తీర్చేలా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు