వలస కార్మికులను ఆదుకోండి

10 Jan, 2017 03:16 IST|Sakshi
వలస కార్మికులను ఆదుకోండి

విదేశాల్లోని భారతీయ సంఘాలకు రాష్ట్రపతి పిలుపు
బెంగళూరు: విదేశాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన భారతీయుల కష్టాలపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నారైలను పెళ్లి చేసుకున్న భారతీయ మహిళలు సహా పలువురు విదేశాల్లో.. అంతర్యుద్ధాలు వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆయన సోమవారమిక్కడ 14వ ప్రవాసీ భారతీయ దివస్‌ కార్యక్రమంలో ముగింపు ప్రసంగం చేశారు. భారతీయ యువతకు వృత్తిపర, సాంకేతిక విద్యలో ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఎన్నారైలు స్వదేశాన్ని సందర్శించాలని, విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే భారతీయులు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్లిన భారతీయులు రేయింబవళ్లు కష్టపడుతు న్నారని, తమ శ్రమ ఫలాలను కుటుంబాలకు పంపుతూ..దేశానికి పెద్దమొత్తంలో డబ్బులు అందిస్తున్నారన్నారు. ప్రపంచంలోని వలసదారులు స్వదేశాలకు పంపే మొత్తంలో భారతీయుల వాటానే(12 శాతం) అధికమని, గత ఏడాది వారు 69 బిలియన్‌ డాలర్ల డబ్బు పంపారని వెల్లడించారు.

మోదీ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ
ప్రధాని మోదీ.. విదేశాంగ విధానంపై విదేశాల్లో చేసిన ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్‌ ఆవిష్కరించారు. ఈ ప్రసంగాలు దేశ ఆర్థిక వ్యూహానికి దోహదపడ్డాయన్నారు. పుస్తకానికి  ప్రణబే ముందుమాట రాశారు.

30 మందికి ప్రవాసీ సమ్మాన్‌ అవార్డులు
పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియా కోస్టా, అమెరికా అధ్యక్ష యంత్రాంగంలోని భారత సంతతి ఉన్నతాధికారి నిషా దేశాయ్‌ బిస్వాల్‌ సహా 30 మందికి ప్రసాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ప్రజాసేవకు గాను కోస్టాకు, ప్రజా వ్యవహారాల్లో కృషికి గాను బిస్వాల్‌కు అవార్డు అందజేశారు. పురస్కార గ్రహీతల్లో ఎన్నారైలు అధిక సంఖ్యలో ఉండగా, అమెరికా నుంచి ఆరుగురు, బ్రిటన్, యూఏఈల నుంచి ఇద్దరు చొప్పున, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ తదితర 20 దేశాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు సదానందగౌడ, వీకే సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు