‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపైప్రెస్ కౌన్సిల్ విస్మయం

18 Jun, 2016 01:51 IST|Sakshi
‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపైప్రెస్ కౌన్సిల్ విస్మయం

- ఏపీ ప్రభుత్వ తీరుపై జర్నలిస్టుల బృందం ఫిర్యాదు
- తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ హామీ
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ప్రసారాల నిలిపివేతపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రసారాల పునరుద్ధరణకు కౌన్సిల్ పరిధిలో చర్యలకుగల అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన తీరుపై ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే సాక్షి టీవీ ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

ప్రజాందోళన లను ప్రసారం చేస్తోందన్న అక్కసుతో ప్రభుత్వం ఈనెల 9 నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో సాక్షి ప్రసారాలను నిలుపుదల చేసిందని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. గతంలో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ వేసిందని ప్రతినిధి బృందం గుర్తుచేయగా.. అన్ని అంశాలను పరిశీలిస్తామని జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల ప్రతినిధుల బృందంలో సీనియర్ జర్నలిస్టులు కొమ్మ కైలాష్(ఆంధ్రభూమి), ఎన్.విశ్వనాథ్(నమస్తే తెలంగాణ), లెంకల ప్రవీణ్ కుమార్(సాక్షి), నాగిళ్ల వెంకటేశ్(సాక్షి టీవీ), గాంధారి దీపక్ రెడ్డి(మన తెలంగాణ), అడబాల రాము(ఆంధ్రభూమి), జగదీష్ జరజాపు(ప్రజాశక్తి), గోపీకృష్ణ(10టీవీ), వి.తిరుపతి(టీన్యూస్), కి శోర్(వీ6), మదార్(హెచ్‌ఎంటీవీ), భరత్‌సింహారెడ్డి(ఐఎన్‌ఎస్‌ఎస్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మ కైలాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను, ప్రసార మాధ్యమాలను అణచివేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాందోళనల ద్వారా ప్రభుత్వం ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలని, అందుకు ప్రసార మాధ్యమాలను వాడుకోవాలన్నారు. అంతేగానీ మీడియాపై వివక్ష వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు