పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు

15 Feb, 2019 14:46 IST|Sakshi

చండీగఢ్‌ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌తో.. భారత్‌ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధు.. తన తాజా వ్యాఖ్యలతో మరోసారి తీవ్ర విమర్శల పాలవుతున్నారు.(ఉగ్ర మారణహోమం)

సిగ్గుచేటు..
సిద్ధు వ్యాఖ్యలపై స్పందించిన రిటైర్డు మేజర్‌ జనరల్‌ జీవీ భక్షి మాట్లాడుతూ..‘ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దేశ భద్రత కోసం యూనిఫాం ధరించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఎదుర్కొనే సమస్యల గురించి ఆయన అవగాహన లేనట్లుంది.  అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’  అంటూ మండిపడ్డారు.(ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం : రాహుల్‌ గాంధీ)

కాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ‘ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు అని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో సిద్ధు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు