పంజాబ్, గోవాల్లో పోల్స్‌ మాటేంటి?

4 Feb, 2017 00:40 IST|Sakshi
పంజాబ్, గోవాల్లో పోల్స్‌ మాటేంటి?

చండీగఢ్‌/పణజి: నోట్ల రద్దు తర్వాత దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరానికి తెరలేసింది. పంజాబ్, గోవాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పంజాబ్‌లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. పంజాబ్‌లో 1.98 కోట్ల మంది ఓటర్లు 1,145 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కాంగ్రెస్‌ మొత్తం సీట్లలో పోటీ చేస్తుండగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ 112 స్థాన్లాల్లో, లోక్‌ ఇన్సాఫ్‌ 5 స్థానాల్లో బరిలో ఉంది. అధికార శిరోమణి అకాలీ దళ్‌ 94 చోట్ల, దాని మిత్రపక్షం బీజేపీ 23 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక 11 లక్షల మంది ఓటేయనున్న గోవాలో 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 34 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ మిగిలిన 5 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తోంది. కాంగ్రెస్‌ 48 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆప్‌ 38 సీట్లలో, మహారాష్ట్రవాదీ గోమంత్‌ పార్టీ(ఎంజీపీ) 28 సీట్లలో బరిలో ఉన్నాయి.  

తొలిసారి ఈ–బ్యాలెట్‌..
ఈ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లకు బదులు తొలిసారి ఈ–బ్యాలెట్‌ను వాడనున్నారు. జవాన్లతో సహా వివిధ సర్వీసు ఉద్యోగులు దీని ద్వారా ఆన్ లైన్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గోవాలో అన్ని స్థానాల్లో, పంజాబ్‌లో ఆత్మనగర్, తూర్పు లుధియానా, ఉత్తర లుధియానా, ఉత్తర అమృత్‌సర్, పశ్చిమ జలంధర్‌.. మొత్తం 5 స్థానాల్లోనూ వీటిని వాడనున్నారు. ఈ–బ్యాలెట్‌ను  ద్వారా డౌన్ లోడ్‌ చేసుకుని, నచ్చిన వారికి ఓటేసి, రిటర్నింగ్‌ అధికారులకు పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పంజాబ్, గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కేజ్రీవాల్‌ ఆప్‌  రెండు చోట్లా బరిలోకి దిగుతోంది.

ఒపీనియన్ పోల్స్‌ మాటేంటి?
పంజాబ్‌లో కాంగ్రెస్‌ లేదా ఆప్‌ అధికారంలోకి వచ్చే వీలుందని పలు సర్వేలు చెప్పాయి. 65 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే–యాక్సిస్‌ అంచనా. ఆప్‌కు 100 సీట్లు రావొచ్చని హఫ్‌పోస్ట్‌–సీటర్‌ సర్వే పేర్కొంది. గోవాలో బీజేపీ గెలవొచ్చని సర్వేలు చెప్పాయి.

మరిన్ని వార్తలు