క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు

27 Aug, 2019 10:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు స్వదేశానికి చేరుకున్నారు.  ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేంద్ర క్రీడల శాఖ మంత్రి  కిరణ్ రిజిజును ఆమె కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధును కేంద్ర మంత్రి అభినందించారు. మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
(చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం)

ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్‌ నింగ్‌ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది.

మరిన్ని వార్తలు