ఆ ఊరికి ‘రఫేల్‌’ మరక..

15 Apr, 2019 15:46 IST|Sakshi

రాయ్‌పూర్ : దేశ రాజకీయాల్లో పెనుదుమారం సృష్టిస్తున్న ఫ్రెంచ్‌ యుద్ధ విమానం రఫేల్‌ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామాన్ని కుదిపేస్తోంది. రఫేల్‌ విమానాల కొనుగోలు దేశంలో వివాదాలకు కేంద్ర బిందువు కాగా ఇదే పేరుతో రఫేల్‌ అనే గ్రామం తమ ఊరి పేరు ఇలా ప్రతికూల వార్తలతో ముడిపడటంపై భగ్గుమంటున్నారు. చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ నియోజకవర్గ పరిధిలోని రఫేల్‌ గ్రామంలో ఈనెల 18న పోలింగ్‌ జరగనుంది.

తమ ఊరి పేరును ఇతర గ్రామాల వారు అవహేళన చేస్తున్నారని, తమ ఊరి పేరు మార్చాలని కోరుతూ తాము సీఎం కార్యాలయానికి వెళ్లామని, అయితే ఆయనను కలిసేందుకు వీలుపడలేదని గ్రామ పెద్ద, 83 ఏళ్ల ధరమ్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. రఫేల్‌ వివాదంతో తమ ఊరిపేరు నెగెటివ్‌ వార్తలతో మార్మోగుతున్నా తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, రాష్ర్టం వెలుపల తమ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదని ఆయన పేర్కొన్నారు. తమ ఊరిలో మంచినీరు, పారిశుధ్ధ్యం వంటి మౌలిక వసతులు సైతం లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ నేతలు దేశంలో ఎన్నో గ్రామాలను రాజకీయ నేతలు దత్తత తీసుకున్నా తమ గ్రామాన్ని ఎవరూ కనీసం సందర్శించలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ గ్రామం పేరు మార్చాలని కోరుతామన్నారు. అయితే రఫేల్‌ అంటే ఏమిటో, తమ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో తనకు తెలియదని ఆయన చెప్పారు. దశాబ్ధాల తరబడి తమ ఊరికి ఇదే పేరు కొనసాగుతోందని తెలిపారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాసముంద్‌ నుంచి సిటింగ్‌ ఎంపీ చందులాల్‌ సాహూ బీజేపీ నుంచి బరిలో నిలవగా, కాంగ్రెస్‌ నుంచి ధనేంద్ర సాహు, బీఎస్పీ నుంచి ధన్‌సింగ్‌ కొసరియా ఆయనతో తలపడుతున్నారు. కాగా, రఫేల్‌ ఒప్పందంలో మోదీ సర్కార్‌ అనిల్‌ అంబానీకి సాయపడేలా అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్‌ సహా విపక్షాలు ఆరోపిస్తున్నసంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు