‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు

23 Jul, 2018 01:55 IST|Sakshi
తల్లిదండ్రులతో ఆశారాం చౌదరి

తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్‌ సీటు సాధించిన మధ్యప్రదేశ్‌ విద్యార్థి

విద్యకయ్యే ఖర్చును భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించిన సీఎం, రాహుల్‌ గాంధీ  

భోపాల్‌: చెత్త ఏరుకునే వ్యక్తి కుమారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ లో సీటు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ఆశారాం చౌదరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ప్రవేశపరీక్షలో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో అతని ర్యాంకు 707. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సీటు రావడంతో కళాశాలలో చేరేందుకు ఆశారాం రాజస్తాన్‌ వెళ్లాడు.

అతని వైద్య విద్యకయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లోనూ ఆశారాం ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 803 ర్యాంకు సాధించాడు. ఆశారాం గురించి తెలుసుకున్న సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అతణ్ని కార్యాలయానికి పిలిపించి అభినందించి, తొలి సాయంగా 25 వేల రూపాయలు అందజేయాల్సిందిగా దేవాస్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ పాండేను ఆదేశించారు. శనివారమే ఆశారాం జోధ్‌పూర్‌ బయల్దేరాడు. అతనికి తోడుగా ప్రభుత్వమే ఓ అధికారిని పంపించింది.

చెప్పలేనంత సంతోషంగా ఉంది: ఆశారాం
ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆశారాం అంటున్నాడు. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు.  తమ్ముడు పన్నెండో తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మా ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదు’ అని ఆశారాం తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు.

న్యూరాలజిస్ట్‌ కావాలన్నదే తన లక్ష్యమనీ, ఎంబీబీఎస్‌ తర్వాత ఎంఎస్‌ చదివి సొంత ఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని ఆశారాం వెల్లడించాడు. తమ ఊరిలోని వైద్యుడు దుర్గా శంకర్‌ కుమావత్‌ తనకు ఎంతో సాయం చేశాడనీ, ఆయనే తన హీరో అని వివరించాడు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ఆశారాంకు ఓ లేఖ రాసి అభినందించారు. ‘నీలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శంగా మారుతారు’ అని రాహుల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు