గవర్నర్‌పై చర్చ.. 'చెడు దృష్టితో వదంతులు..'

17 Dec, 2017 07:45 IST|Sakshi

రాజ్‌భవన్‌ వివరణ

సాక్షి, టీ.నగర్‌: రాష్ట్రంలో ఇటీవల గవర్నర్‌పై ఏర్పడిన చర్చకు రాజ్‌భవన్‌ శనివారం వివరణ ఇచ్చింది. రాష్ట్ర గవర్నర్‌గా బన్వారీలాల్‌ పురోహిత్‌ పదవి చేపట్టిన నాటి నుంచి రాజకీయాలలో సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. ప్రస్తుతం ఫుల్‌టైం గవర్నర్‌గా నియమించబడడంతో ఆయనపై అన్ని వర్గాలు ఎన్నో అంచనాలు పెంచుకున్నాయి. ఆరంభంలో ఆయన రాజ్‌భవన్‌కే పరిమితమయి అధికారుల ద్వారా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. 

ఆ తర్వాత ప్రభుత్వ పథకాల పరిశీలన చేపట్టారు. ఆ తర్వాత కన్యాకుమారి వెళ్లి బాధితుల స్థితిగతుల గురించి తెలుసుకుని పరామర్శించారు. ఢిల్లీలో తుపాను నష్టాన్ని గురించి నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇలాఉండగా శుక్రవారం గవర్నర్‌ పురోహిత్‌ కడలూరును సందర్శించి పరిశీలన చేపట్టారు. అక్కడ గవర్నర్‌ పరిశీలనకు వ్యతిరేకత తెలుపుతూ డీఎంకే, వీసీకే పార్టీలు ఆందోళనలు జరిపాయి. 

మహాబలిపురం సమీపాన గవర్నర్‌ను సాగనంపి వెనుదిరిగిన పోలీసు వాహనం ఢీకొనడంతో ముగ్గురు బలిౖయెన సంఘటన, గవర్నర్‌ మరుగుదొడ్డిని తిలకించిన సంఘటనలు కొత్త వివాదానికి దారితీశాయి. ఇందుకు రాజ్‌భవన్‌ వివరణ ఇచ్చింది. గవర్నర్‌ కాన్వాయ్‌ ద్వారా ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇందులో వాస్తవాలు లేవని తెలిపింది. స్వచ్ఛభారత్‌ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించే ప్రాంతాన్ని తిలకించినట్లు, దీన్ని చెడు దృష్టితో పలువురు వదంతులు వ్యాపింపజేశారని పేర్కొన్నారు. మరుగుదొడ్డి ఖాళీగా ఉన్నట్లు ధ్రువపరచుకున్న తర్వాతనే మహిళా డీఆర్‌వో వెనుక కలెక్టర్, గవర్నర్‌ మరుగుదొడ్డి వద్దకు వెళ్లినట్లు రాజ్‌భవన్‌ వివరించింది. ఇలావుండగా అసత్య వార్తలు ప్రసారం చేసిన మీడియాపై గవర్నర్‌ పురోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుదుచ్చేరి దాదాపై చర్యలకు కిరణ్‌బేడీ ఆదేశాలు: రూ.22 కోట్ల ఇళ్ల స్థలాల అపహరణకు సంబంధించి పుదుచ్చేరి దాదాపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్‌ కిరణ్‌బేడి ఆదేశాలిచ్చారు. చెన్నై పెరుంగుడి తిరుమలైనగర్‌కు చెందిన రిటైర్డ్‌ పోలీసు అధికారి రత్నవేలు (59) సహా మరికొందరు తాము కొనుగోలు చేసిన రూ.22 కోట్ల ఇళ్ల స్థలాలను పుదుచ్చేరికి చెందిన దాదా తట్టాంజావడి సెంథిల్‌ కబ్జా చేసినట్లు కిరణ్‌బేడికి ఫిర్యాదు అందింది. దాదాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

షాకింగ్‌ : నేను స్నానం చేస్తుంటే గవర్నర్‌ చూశారు..!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు