రామాలయ నిర్మాణానికి 21న శ్రీకారం: స్వరూపానంద

31 Jan, 2019 03:49 IST|Sakshi

అలహాబాద్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 21న శ్రీకారం చుడతామని ఆధ్యాత్మిక నాయకుడు స్వామి స్వరూపానంద సరస్వతి బుధవారం చెప్పారు. బుల్లెట్లను ఎదుర్కోడానికైనా సరే తాము సిద్ధమేనన్నారు. మూడు రోజుల కుంభమేళా ముగింపు సందర్భంగా ఈ నిర్ణయాన్ని అలహాబాద్‌ (ప్రయాగ్‌ రాజ్‌)లో స్వరూపానంద ప్రకటించారు. అయోధ్యలో గతంలో సేకరించిన, వివాదరహిత భూమి ని తిరిగి వాస్తవ యజమానులకు అప్పగిం చేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్‌ వేసిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.

అలహాబాద్‌లో ధర్మ సభ అనంతరం ద్వారాకా పీఠానికి చెందిన శంకరాచార్య ఓ ప్రకటన విడుదల చేస్తూ హిందువులంతా ఒక్కొక్కరు నాలుగు ఇటుకలు పట్టుకుని ఫిబ్రవరి 21న అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. సాధువులంతా వసంతపంచమి రోజైన ఫిబ్రవరి 10న అలహాబాద్‌ నుంచి అయోధ్యకు తమ యాత్రను ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందనీ, అయితే ఇప్పుడు తాము రామాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఇంకెప్పటికీ కుదరకపోవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు