‘రాహుల్‌ ఒక ఎంటర్‌టైనర్‌ మాత్రమే’

10 Nov, 2018 20:06 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం లేదని, అతన్ని ఒక ఎంటర్‌టైనర్‌గా మాత్రమే చూస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అన్నారు. రాహుల్‌కు ఛత్తీస్‌గఢ్‌ గురించి ఏమి తెలియదని, అతని ర్యాలీల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి నష్టమే కాని ఉపయోగం లేదన్నారు. రాహుల్‌ ర్యాలీలతో ఒక్క ఓటు కూడా పడదని విమర్శించారు. మొదటి విడత ఎన్నికలు దగ్గర పడడంతో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. 

కాంగ్రెస్‌ పాలించేటప్పుడే కార్పోరేట్‌లకు అనుకూలంగా ఉండేదని రమణ్‌ సింగ్ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్టాం అభివృద్ధిలో తిరోగమనంలో ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతోందన్నారు. బీఎస్‌పీ(బహుజన సమాజ్‌ పార్టీ), జనతా కాంగ్రెస్‌ పార్టీలు స్వార్ధ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాయని, ఇలాంటి పార్టీలు ఎన్ని కలిసినా బీజేపీని ఏమీ చేయలేవని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించామని రమణ్‌సింగ్‌ అన్నారు. త్వరలోనే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్నున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాహుల్‌ గాంధీ సీరియస్‌గా తీసుకొని ప్రచారంలో వేగాన్ని పెంచారు. కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రలలో కార్పోరేటు అనుకూల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని శుక్రవారం రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

గిరిజన రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌12 న నక్సల్‌ ప్రభావం ఉన్న 18 స్థానాలకు ఓటింగ్‌ జరగనుండగా, మిగిలిన 72 స్థానాలకు నవంబర్‌ 20 న ఓటింగ్‌ జరగనుంది. సోమవారం జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన రాజ్‌నాడ్‌గాన్‌లో కూడా ఓటింగ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు