అత్యాచారానికి గురైనా టెన్త్ పరీక్షలకు సిద్ధం

9 Mar, 2016 18:42 IST|Sakshi
అత్యాచారానికి గురైనా టెన్త్ పరీక్షలకు సిద్ధం

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే రాజ్ వల్లభ్ యాదవ్ కబంధ హస్తాల్లో అత్యాచారానికి గురైన నలందకు చెందిన 15 ఏళ్ల బాలిక గురువారం నుంచి బిహార్‌లో జరగనున్న పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. జరిగిన ఘోర కృత్యానికి కృంగిపోకుండా, చంపేస్తామంటూ ఎమ్మెల్యే అనుయాయుల నుంచి బెదిరింపులు వస్తున్నప్పటికీ మానసిక స్థైర్యాన్ని కూడదీసుకొని మరీ పరీక్షలకు చదువుతోంది. ఎవరో చేసిన పాపానికి తన జీవితాన్ని బలి తీసుకోకూడదనే ఉద్దేశంతో పదవ తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరాకావాలని నిశ్చయించుకుంది.
 
వెన్నంటి వచ్చే పోలీసు జవాన్ల భద్రత మధ్య ఎక్కడో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లడం, అందరి దృష్టిలో పడడం ఎంత అవమానకరమో ఆమె అర్థం చేసుకునే ఈ నిర్ణయానికి వచ్చింది. బెదిరింపుల కారణంగా ఆమెకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. తొలుత ఆమెకు తానుంటున్న ఊరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రం పడింది. పోలీసుల సహాయంతో ప్రతిరోజు అంతదూరం వెళ్లి పరీక్షలు రాయడం కష్టమే కాకుండా, కాకుల్లా పొడిచే సమాజం నుంచి నష్టం కూడా జరుగుతుందని బాధితురాలి తండ్రి నలంద జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

మానవతా దృక్పథంలో ఆ దరఖాస్తును పరిగణలోకి తీసుకున్న జిల్లా మేజేస్ట్రేట్ ఊరికి దగ్గర్లో పరీక్ష రాసేందుకు ఆ బాలికకు అవకాశం కల్పించారు. ఆ కేంద్రం వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు.  రాజ్ వల్లభ్ యాదవ్ ఇంట్లోనే ఫిబ్రవరి 6వ తేదీన ఆ బాలికపై అత్యాచారం జరిగింది. సులోచన అనే అమ్మాయి పుట్టిన రోజు పేరిట ఏర్పాటు చేసిన పార్టీకి ఆ బాలికపై వెళ్లినప్పుడు ఈ దారుణం చోటుచేసుకుంది.

నెల రోజులు గడిచినా పరారీలో ఉన్న ఎమ్మెల్యే యాదవ్‌ను పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఆయన్ని పట్టుకోవడానికి ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినా, ఆస్తులను జప్తు చేసినా యాదవ్ జాడ లేదు. ఎమ్మెల్లే ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రెగ్యులర్ బెయిల్‌కు పిటీషన్ దాఖలు చేశారు. అది త్వరలోనే విచారణకు కోర్టు ముందుకు రాబోతోంది.

మరిన్ని వార్తలు